telugu navyamedia
క్రీడలు వార్తలు

భవిష్యత్తు సారథుల్లో ఒకడు పంత్ : గవాస్కర్

ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను పంత్ చక్కగా ముందుకు నడిపించాడని ఆయన ప్రశంసించారు. జట్టును గెలిపించాలన్న జ్వాల, నేర్చుకొనే తపన అతడిలో కనిపించాయని సన్నీ తెలిపారు. పలు జట్లలో కరోనా కేసులు వెలుగు చూడడంతో బీసీసీఐ టోర్నీని నిరవధిక వాయిదా వేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో మిగిలిన టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘యువ రిషబ్ పంత్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిలబడింది. ప్రతిసారీ నాయకత్వం గురించి ప్రశ్నించే సరికి ఆరో మ్యాచుకే అతడు విసిగిపోవడం మనం చూడొచ్చు. ఎందుకంటే.. ప్రతి మ్యాచ్‌ తర్వాత అతడిని ఇదే ప్రశ్న అడుగుతున్నారు. చూసొచ్చేందుకు అనుమతిస్తే కాల్చొచ్చేందుకు సిద్దంగా ఉంటానన్న జ్వాలను పంత్ ప్రదర్శించాడు. అవును, సారథిగా కొన్ని తప్పులు చేశాడు. ఒక మ్యాచులో బౌలర్లను, ఫీల్డర్లను మోహరించడంలో విఫలం అయ్యాడు. అయితే పొరపాట్లు చేయని సారథి ఎవరుంటారు? చెప్పండి’ అని ప్రశ్నించారు. ‘పొరపాట్ల నుంచి నేర్చుకొనే తత్వం రిషబ్ పంత్‌లో కనిపించింది. చాలా సందర్భాల్లో అతడు ప్రత్యర్థి కన్నా ముందున్నాడు. ఒక్కో సమయంలో సీనియర్ సారథిని తలపించాడు. జట్టును నడిపించేందుకు తనవైన దారులు వెతికాడు. పంత్ భవిష్యత్తు సారథుల్లో ఒకడు. అందులో సందేహమే లేదు. ప్రతిభకు అవకాశం వచ్చినప్పుడు.. వినియోగించుకోవడానికి కావాల్సిన టెంపర్‌మెంట్‌ అతడిలో ఉంది. పంత్ మంచి బ్యాట్స్‌మన్‌, సారథిగా ఎదుగుతాడు. ఆ నమ్మకం నాకు ఉంది’ భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.

Related posts