భారతీయ రైల్వే శాఖ మరోసారి భారీగా ఉద్యోగ భర్తీ చేపట్టడానికి సిద్ధం అయ్యింది. ఈ నోటిఫికేషన్ రెండు దఫాలుగా విడుదల చేస్తున్నారు. మొత్తం 2.50 లక్షల ఉద్యోగాల భర్తీకి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన అగ్రవర్ణాల్లోని పేదలకు పదిశాతం రిజర్వేషన్‌ను ఇందులో అమలు చేస్తామని మంత్రి చెప్పారు. లక్షన్నర ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైందని, వచ్చే రెండేళ్లలో మరో లక్ష మంది ఉద్యోగులు రిటైర్ అవుతారని మంత్రి తెలిపారు. దీనితో వచ్చే రెండేళ్లలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
ఫిబ్రవరిలోనే తొలి విడత రైల్వే ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు మంత్రి వివరించారు. మే నెలలో రెండో విడత భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు చెప్పారు. ఆగస్టు 2021 నాటికి మొత్తం భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని రైల్వే వర్గాలు తెలిపాయి. కాగా, గతేడాది 1.2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ కాగా 2.5 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు.