telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్ : మరో రెండ్రోజులు భారీ వర్షాలు..

ఏపీలో 5 జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం హై అలెర్ట్ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వచ్చే రెండ్రోజులు ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది

ఇప్ప‌టికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌కు గోదావరి నది కి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 5,91,269 క్యూసెక్కులుగా ఉంది. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని సమీక్షిస్తూ వరద ముంపు ప్రభావిత జిల్లాల అధికారులను విపత్తుల సంస్థ అప్రమత్తం చేస్తోంది.

 ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.

కాగా.. రాష్ట్రంలో వరద విపత్తును ఎదుర్కోటానికి ముందస్తుగా అత్యవసర సహాయక చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిధ్ధం చేశారు. లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజల్ని అధికార యంత్రాంగం అలర్ట్ చేసింది. అవసరం ఉంటే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

Related posts