telugu navyamedia
తెలంగాణ వార్తలు

భాగ్య‌న‌గ‌రంలో భారీ వ‌ర్షం..

హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో మ‌రోసారి భారీ వర్షం కురిసింది. ఈ ప్రాంతం.. ఆ ప్రాంతం అని తేడా లేకుండా నగరం మొత్తం కుంటపోత కురిసింది. కూకట్​పల్లి పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, పెద్దఅంబర్​పేట, అనాజ్‌పూర్​లో కూడా వర్షం పడింది. దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, చంపాపేట్‌లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.

పాతబస్తీ, గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం పడింది.హబ్సీగూడ, నాగోల్, రామంతపూర్‌, కాచిగూడ, ఎల్బీనగర్‌, మన్సూరాబాద్, మీర్‌పేట్, తుర్కయంజాల్‌, శంషాబాద్, రాజేంద్రనగర్, కిస్మత్‌పూర్‌, రాంనగర్​ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

వాహనదారులు ఒక్కసారిగా పడిన వర్షానికి తడిసి ముద్దయ్యారు. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన GHMC, DRF, అత్యవసర విభాగాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. హై అలెర్ట్ ప్రకటించిన జీహెచ్ఎంసీ

కాగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు క్రింది స్థాయి గాలులు తూర్పు, ఈశాన్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నట్లు తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ బలహీన పడినట్లు పేర్కొంది. ఈ నెల 10న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ, వాయవ్య దిశగా ప్రయాణించి తదుపరి నాలుగైదు రోజుల్లో దక్షిణ ఒడిశా- ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతదేశంలోని కొన్ని భాగాల నుంచి విరమించాయని.. రాగల 2 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్​లలో మరికొన్ని భాగాల నుంచి విరమించే అవకాశాలు ఉన్నట్లు ప్రకటించింది.

Related posts