ఏపీ రాజధానులపై నియమించిన జీఎన్ రావు కమిటీ తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అనంతరం కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. జీఎన్ రావు కమిటీ సభ్యులు మాట్లాడుతూ, సీఎం జగన్ కు అధ్యయన నివేదిక అందజేశామని తెలిపారు. రెండు అంశాల ఆధారంగా ఈ నివేదికను ఇచ్చినట్టు చెప్పారు. ప్రాంతీయ సమతుల అభివృద్ధిపై నివేదిక ఇచ్చామని, సహజవనరులు అన్ని ప్రాంతాలకు సమానంగా వర్తించేలా అధ్యయనం చేసినట్టు తెలిపారు.
గతంలో రాజధానిపై ఏర్పాటైన శివరామకృష్ణ కమిటీ రిపోర్టునూ పరిశీలించామని చెప్పారు. ఏపీలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, మరికొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని వెల్లడించారు. తీర ప్రాంతంపై అభివృద్ధి ఒత్తిడి ఎక్కువుందని, అభివృద్ధిని మిగతా ప్రాంతాలకూ విస్తరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు వెనుకబడి ఉన్నాయని ప్రకటించారు.