రేపటి నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో అధికార, ప్రతిపక్ష నేతలతోపాటు టీడీపీ తరఫున గల్లా జయదేవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లుల గురించే కాకుండా, రాష్ట్ర సమస్యలపైనా చర్చించాలని అఖిలపక్షాన్ని కోరామని వెల్లడించారు. విభజన చట్టం ప్రకారం అపరిష్కృత అంశాలు అనేకం ఉన్నాయని, వాటిపై చర్చించి పరిష్కరించాలని కోరినట్టు తెలిపారు. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చాక మారిన పరిస్థితులను కూడా పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని నిర్ణయించినట్టు గల్లా జయదేవ్ వెల్లడించారు. పార్టీలకు కేటాయించే సమయాన్ని కూడా పెంచాలని అడిగినట్టు తెలిపారు.