telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సొంత పార్టీ నేతలపై రోజా పోలీసులకు ఫిర్యాదు..

వైఎస్సార్‌సీపీలో సొంత పార్టీలోని నేత‌ల మ‌ధ్య లుక‌లుక‌లు మ‌ళ్ళీ మొద‌ల‌య్యాయి. చాలా రోజులుగా చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్‌సీపీలో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే రోజా, కేజే కుమార్‌లు రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 

శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్‌కు సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రోజా ఫిర్యాదు చేశారు. అక్ర‌మ మైనింగ్‌కు పాల్ప‌డుతున్నాన‌ని కొందరు ప‌నిక‌ట్టుకుని దుష్ర్ప‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

త‌న అనుచ‌రులుతో అక్ర‌మ మైనింగ్ చేయిస్తున్న‌ట్లు కొంద‌రు రాష్ట్ర డీజీపీని క‌లిసి ఫిర్యాదు చేశార‌ని, ఆయ‌న‌తో తీసుకున్న ఫోటోలుకు త‌గ్గేదేలే అంటూ క్యాప్స‌న్ పెట్టి ప్ర‌చారం చేయిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దొంగ‌లే…దొంగ దొంగ అన్న‌ట్టుగా 1992 నుంచి నేరస్థుల జాబితాలో ఉన్న‌వాళ్లు ఈ రోజు మ‌మ్మ‌ల్ని దొంగ‌లు అంటున్నార‌ని అన్నారు. ఇటు క‌ల‌క్టెర్‌గారిని అటు ఎస్‌.పి గారిని ఇటు మినిస్ట‌ర్ గారిని , జ‌గ‌న్ గారిని అవ‌మాన ప‌రిచే విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని అన్నారు.

వైసీపీ పార్టీలోనే ఉంటూ టీడీపీకి కోవర్టులుగా పనిచేస్తూ వీళ్ళు పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కోవర్టులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

గతంలో పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొటోలను ఫ్లెక్సీల్లో వేసుకుని అధికారులను బెదిరిస్తూ తిరుగుతున్నారని రోజా పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లానని తెలిపారు.

Related posts