అమెరికాలోని లాస్‌ఏంజెలెస్ నుంచి మనీలా బయలుదేరిందా విమానం. సరదాగా హాలీడే గడుపుదామని బయలుదేరిన వారే ఎక్కువగా ఉన్నారందులో. గురువారం ఉదయం 11 గంటలకు బయలుదేరిన ఫిలిప్పైన్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ విమానం.. టేకాఫ్ అయిన కాసేపటికే ఓ పెద్ద జర్క్ ఇచ్చింది. విమానం కుడివైపు రెక్కలోంచి దట్టమైన పొగలు, మంటలు వస్తున్నాయి. ఆ మంటలు బయటకు చిమ్మినప్పుడల్లా విమానం భయంకరంగా ఊగిపోతోంది. దీంతో ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. అయితే కొందరు ప్రయాణికులు మాత్రం జరుగుతున్న తతంగాన్ని తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు. ఈ విషయం తెలుసుకున్న విమాన పైలట్.. విమానం ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని, అందువల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చాడు. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పి, విమానాన్ని వెనక్కితిప్పాడు. లాస్‌ఏంజెలెస్ విమానాశ్రయ అధికారులను సంప్రదించి అక్కడే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలూ కాలేదని ఫిలిప్పైన్స్ ఎయిర్‌లైన్స్ అధికారులు ప్రకటించారు. ఈ ఘటనకు కారణం కనుక్కోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
video source: ABC7