telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

“మా” తో చేతులు కలిపినా బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్

మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఇప్పుడు సరికొత్త మైలురాయిని చేరుకుంది. భారతదేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలను ఏకం చేసే మిషన్‌ను విష్ణు మంచు ప్రారంభించారు. అందులో భాగంగా మా ప్రెసిడెంట్ విష్ణు మంచు మరియు కోశాధికారి శివ బాలాజీ కలిసి జూన్ 17న ముంబై వెళ్లి బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళతో కలిసి రెండు అసోసియేషన్ లు కలిసికట్టుగా ఉండాలి అనే ప్రతిపాదన ఉంచారు. దానికి హిందీ పరిశ్రమ అంగీకారం తెలిపింది. “మా” (MAA), Cinetaa (హిందీ చలనచిత్రం మరియు TV అసోసియేషన్) ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం తెలుగు చిత్ర పరిశ్రమలోని కళాకారులు, బాలీవుడ్ సోదరుల మధ్య సోదరభావానికి నాంది పలుకుతుంది.

ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ విష్ణు మంచు మాట్లాడుతూ “మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరియు బాలీవుడ్ అసోసియేషన్‌ల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం తెలుగు చిత్రాలలో పని చేసే బాలీవుడ్ కళాకారులకు “మా” సభ్యత్వం అందుతుంది. అలాగే మన తెలుగు నటీనటులు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తే వాళ్ళకి బాలీవుడ్ అసోసియేషన్ సభ్యత్వం అందుతుంది. ఏవైనా వివాదాలు తలెత్తితే ‘మా’ వాళ్ళకి అండగా ఉంటుంది. వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

“ఒకే కుటుంబం గా అన్ని చిత్ర పరిశ్రమలు”

ఈ ఒప్పందంతో మన తెలుగు నటీనటులకు బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వస్తాయి. త్వరలోనే వేరే ఇండస్ట్రీలతో కూడా ఈ ఒప్పందం జరుగుతుందని, అన్ని ఇండస్ట్రీలు ఓకే కుటుంబం గా ఉండాలి” అని విష్ణు మంచు తెలిపారు.

“మా సభ్యుల కోసం సంక్షేమ పథకాలు”

విష్ణు మంచు నేతృత్వంలోని అక్టోబర్ 2021 నుండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విజయాలు చవిచూసింది. “మా” సభ్యత్వ నమోదులో సంస్కరణలు, “మా” ఆరోగ్యానికి పెద్ద పీట వేసింది. హైదరాబాద్‌లోని అగ్రశ్రేణి కార్పొరేట్ ఆసుపత్రులతో కలిసి మెడికల్ హెల్త్ కార్డ్స్ మరియు హెల్త్ క్యాంపు నిర్వహించింది. పేద మరియు అణగారిన కళాకారులకు వృద్ధాప్య భద్రతా పింఛను గణనీయంగా అందించింది. చనిపోయిన నటీనటుల బంధువులకు ఆర్ధిక సహాయం మరియు వారి పిల్లల చదువుకు కావాల్సిన నగదును అందించింది.

“మహిళా కళాకారుల భద్రత”

మహిళా కళాకారులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, వారి సంబంధిత వర్క్ స్టేషన్‌లలో వారి భద్రత కోసం ప్రత్యేకమైన “మహిళా కళాకారుల సాధికారత ప్యానెల్”ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి గౌరవాధ్యక్షురాలిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి సునీతా కృష్ణన్‌ను కూడా విష్ణు ఎంపిక చేసుకున్నారు.

“మా నటీనటుల పిల్లలకు చదువులో రాయితీ”

తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీ ప్రో-ఛాన్సలర్‌గా ఉన్న శ్రీ విష్ణు మంచు, వారి విద్యాసంస్థల్లో ప్రవేశం కోరుకునే సినీ ప్రముఖుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు మరియు ట్యూషన్ ఫీజులో రాయితీలను ప్రకటించారు.

మా కోసం “సొంత భవనం” కలను సాకారం చేస్తానని వాగ్దానం చేసిన మంచు విష్ణు, అది త్వరలో నెరవేరే అవకాశం ఉందని అన్నారు.

Related posts