telugu navyamedia
రాజకీయ వార్తలు

వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – కమిషనర్ రోనాల్డ్ రోస్

గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో  క్షేత్ర స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని  జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు.
హిమాయత్ నగర్  లోని ఆదర్శ్ బస్తీలో ముంపుకు గురైన ప్రాంతాన్ని, అదే విధంగా నల్లకుంట పద్మ నగర్, నాగయ్య కుంట అడిక్ మెట్ ప్రాంతాల్లో వర్షంతో ఇబ్బందికి గురైన ప్రాంతాలతో పాటు నాలా పనులను శుక్రవారం ముషీరాబాద్ శాసన సభ్యులు ముఠా గోపాల్ తో కలిసి కమిషనర్ పరిశీలించారు.
ముందుగా హిమాయత్ నగర్ స్ట్రీట్ నెం.14  లోతట్టు ప్రాంతంలో గత రాత్రి నుండి కొన్ని గృహాలలో నాలా పొంగి ప్రవేశించడంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీం తో పాటు డి ఆర్ ఎఫ్ టీం లు మోటర్లు పెట్టి నీటిని బయటకు  పంపించి ప్రజలకు ముంపు నుండి విముక్తి కలిగించారు.

ఈ నేపథ్యంలో అట్టి ముంపు ప్రాంతాలను కమిషనర్ రోనాల్డ్ రోస్ తో పాటుగా ఈవిడిఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, లేక్ సి ఇ  సురేష్ కుమార్, యస్ ఈ ఆనంద్ తో కలిసి పరిశీలించారు.

నాలా పొంగటానికి గల కారణాలను కమిషనర్ లేక్ ఇంజనీరింగ్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. హుస్సేన్ సాగర్ నాలా లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రవాహం కంటే లోతట్టు గా ఉన్నందున నీరు వచ్చినట్లు  అధికారులు తెలిపారు. రాత్రి నుండి మోటార్ల ద్వారా నీటిని తరలించడం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు కమిషనర్  కు వివరించారు.

 ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని హిమాయత్ నగర్ స్ట్రీట్ 14 లో   ఆదర్శ్ బస్తీ లో నాలా రిటర్నింగ్ వాల్ నిర్మాణంను రాబోయే రోజుల్లో చేపట్టి వరద నీరు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మూడురోజుల పాటు కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసి తీసుకుంటున్న చర్యల పై ఎప్పటి కప్పుడు మంత్రి కేటిఆర్ సమీక్షిస్తున్నారని కమిషనర్ తెలిపారు.
వర్ష ప్రభావం ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 24 గంటల పాటు 428  మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు పని చేస్తున్నాయని అంతే కాకుండా 27 డి ఆర్ ఎఫ్ బృందాలు కూడా పని చేస్తున్నాయని కమిషనర్ తెలిపారు. ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన  ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు క్షేత్ర స్థాయిలో అప్రమత్తం చేసినట్లు వివరించారు. తదనంతరం నల్లకుంట పద్మ నగర్ లో ముంపుకు గురైన ప్రాంతాల్లో శాసన సభ్యులు ముఠా గోపాల్ తో కమిషనర్ పరిశీలించారు. ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన  పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కమిషనర్ వెంట సికింద్రాబాద్ జోనల్ ఎస్ ఈ అనిల్ రాజ్, డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts