telugu navyamedia
తెలంగాణ వార్తలు

పచ్చని సంసారంలో నిప్పులు పోసిన వారి భరతం పడతా..

హుజురాబాద్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన త‌రువాత రాజేందర్ మరోసారి టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. ఉపఎన్నిక కోసమే 6 నెలలుగా అధికార యంత్రాంగం పనిచేసిందని విమర్శించారు. నిర్బంధాలు పెట్టి రూ.వందల కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు.

ఈటలను ఓడించడమే అజెండాగా పెట్టుకున్నారని అన్నారు. కుల సంఘాలు, భవనాలు, గుడులకు డబ్బులిచ్చారన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా… తనను గెలిపించిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తన గెలుపును తమ గెలుపుగా భావించి అంతా దీపావళి చేసుకున్నారని అన్నారు.

హుజురాబాద్‌లో ప్రచారం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల భరతం పడతానని, వాళ్ల నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తానని ఈటల తెలిపారు. పచ్చని సంసారంలో నిప్పులు పోసిన వారి నియోజకవర్గాల్లో ప‌ర్య‌టిస్తాన‌ని అన్నారు. ఇది కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన గెలుపు అని అభివర్ణించారు. హుజురాబాద్ ప్రజలకు తన చర్మం వొలిచి చెప్పులు కుట్టించినా వారి రుణం తీర్చుకోలేనని తెలిపారు.

కేసీఆర్‌కు ఈటెల వెన్నుపోటు పొడిచాడ‌ని టీఆర్ ఎస్ నేత‌లు కొంద‌రు అంటున్నార‌ని, అయితే వెన్ను పొడిచింది కేసీఆరే అని, 18 సంవ‌త్స‌రాలు ప‌నిచేసిన త‌న‌ను పార్టీ నుంచి వెళ్లగొట్టిన కేసీఆరే అని.. టీఆర్ఎస్ పార్టీ తనను భర్తరఫ్ చేస్తే తనను అక్కున చేర్చుకున్న‌ది బీజేపీపార్టీ అని, తనకు అండగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఈటల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన బీజేపీ నేతలకు ధన్యవాదాలు చెప్పారు.

దళిత బంధు పది సార్లు ఇస్తామని చెప్పినా ప్రజలు వారి మాటలు నమ్మలేదని.. ఓట్ల కోసం స్మశాన వాటికల్లో కూడా డబ్బులు పంచిన నీచులు టీఆర్ఎస్ పార్టీ నేతలు అని విమర్శలు చేశారు. హుజురాబాద్ ప్రజల తీర్పు రాష్ట్ర ప్రజల అభిప్రాయమని ఈటల పేర్కొన్నారు. రాబోయే కాలంలో బీజేపీని మరింత పటిష్టం చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని ఈటల తెలిపారు.

Related posts