telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జగన్ పాలన రావాలని కోరుకున్నాం ..: ఉద్యోగస్తులు

తాజాగా ఒక మీడియా ఛానల్ తో.. ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధులు కొంద‌రు మాట్లాడుతూ … ప్ర‌భుత్వ ఉద్యోగులంద‌రం జ‌గ‌న్ పాల‌న రావాల‌ని కోరుకున్నామ‌ని చెప్పారు. అందుకు వారు చెప్పిన మూడు కారణాలు – ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో బ‌యోమెట్రిక్ వ్య‌వ‌స్థ‌ల్ని తొల‌గించ‌డం; ఉద్యోగుల‌కు 27 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వ‌డం; పీఆర్‌సీ త‌దిత‌ర ఇత‌ర ప్ర‌యోజ‌నాలు. ఆ వార్త చూసిన త‌రువాత మూడు సందేహాలు ఎదుర‌వుతున్నాయి.
* విధినిర్వ‌హ‌ణ‌లో జ‌వాబుదారీత‌నాన్ని పెంచే బ‌యోమెట్రిక్ వ్య‌వ‌స్థ‌ను నిర్మూలించ‌డం ద్వారా ప్ర‌భుత్వోద్యోగులు ప్ర‌జ‌ల‌కు ఎటువంటి సంకేతాలు ఇవ్వాల‌నుకుంటున్నారు?
* వేత‌నాల పెంపు విష‌యంలో ఉద్యోగులు త‌మ ప్ర‌యోజ‌నాల‌ను జ‌నం ప్ర‌యోజ‌నాల‌తో ముడిపెట్ట‌కుండా ఎందుకు ఆలోచిస్తున్నారు? త‌మ సంక్షేమాన్ని ప్ర‌జా సంక్షేమానికి ఎందుకు ముడిపెట్టి మాట్లాడ‌లేక‌పోతున్నారు?
* త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాల నిమిత్తం ఇంత ఉద్య‌మ‌స్థాయిలో మాట్లాడుతున్న ఉద్యోగులు … ప‌రిపాల‌న‌లో అవినీతిని నియంత్రించ‌డానికి, స‌జావైన పౌర‌పాల‌న అందించ‌డానికి ఎందుకు హామీ ఇవ్వ‌లేక‌పోతున్నారు?
* బ‌యోమెట్రిక్ వ్య‌వ‌స్థ వ‌ల్ల ఉద్యోగులు త‌మ ఆఫీసు ప‌నివేళ‌ల్ని విధినిర్వ‌హ‌ణ కోస‌మే ఉప‌యోగిస్తున్నార‌ని ప్ర‌జ‌ల‌కు విశ్వాసం ఏర్ప‌డుతుంది. ఉద్యోగులు నిజంగా అద‌న‌పు ప‌నిగంట‌లు ప‌నిచేసిన‌ట్ల‌యితే అందుకు మ‌రికొంత అద‌న‌పు వేత‌నం ఇవ్వ‌మ‌ని ప్ర‌భుత్వాన్ని కోర‌వ‌చ్చు కూడా. కానీ, ఈ రోజు మెజారిటీ ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో స‌గానికి స‌గం ప‌ని ఎప్పుడూ పెండింగ్ లోనే వుంటోంది. టెక్నాల‌జీ ఎంత అందుబాటులోకి వ‌స్తుంటే, దానిని అడ్డుకోవ‌డానికి అంత ప్ర‌య‌త్నం ప్ర‌భుత్వాఫీసుల్లోనే జ‌రుగుతోంది. కంప్యూట‌ర్లు, టెక్నాల‌జీ నిత్యావ‌స‌రాలుగా మారిన ఇర‌వై ఏళ్ల త‌ర్వాత ఇవ్వాళ్టికి కూడా ఉద్యోగ సంఘాలు వాటిని నిర‌సిస్తున్నాయంటే ప‌రిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? ప‌్ర‌పంచం సూప‌ర్‌సానిక్ స్పీడ్‌లో ముందుకు వెళ్తుంటే మ‌న ఉద్యోగులెందుకు ఇంకా మాన్యువ‌ల్‌గా ప‌నిచేయ‌డానికే ఆస‌క్తి చూపుతున్నారు? ఇందులో ప్ర‌జల ప్ర‌యోజ‌నాలేమైనా ముడిప‌డివున్నాయ‌ని భావించాలా?

* నాలుగేళ్ల క్రిత‌మే తెలుగుదేశం ప్ర‌భుత్వం తెలంగాణ ప్ర‌భుత్వాన్ని అనుస‌రిస్తూ ఏపీ ప్ర‌భుత్వోద్యోగుల‌కు 43% ఫిట్‌మెంట్‌ను అమ‌లుచేసింది. ఫ‌లితంగా ఈరోజు చిన్న‌స్థాయి ఉద్యోగికి కూడా ఇర‌వై వేల రూపాయ‌ల‌కు త‌గ్గ‌కుండా ఆదాయం వ‌స్తోంది. అసంఘ‌టిత రంగాల్లో, ప్ర‌యివేటు రంగం లోని వేత‌నాల‌తో పోలిస్తే ఇది క‌నీసం 50-60 శాతం ఎక్కువ‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాల్లోని ప్ర‌భుత్వోద్యోగుల జీతాల త‌ల‌స‌రిని గ‌మ‌నిస్తే … మ‌న దేశంలో ప్ర‌భుత్వోద్యోగులకు ల‌భిస్తున్న వేత‌నాలు చాలా మెరుగైన‌వే. ఆయా దేశాల్లో వేత‌నాల పెంపున‌కు ఉద్యోగుల ప‌నితీరును ప్రామాణికంగా చూస్తారు. ఇక్క‌డ ఉద్యోగుల ప‌నితీరుకు అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్రాలు కానీ ఎటువంటి ప్ర‌మాణాల‌నూ ఏర్ప‌ర‌చ‌లేదు. పౌర స‌మాజానికి ప్ర‌భుత్వోద్యోగుల వ‌ల్ల ల‌భిస్తున్న స‌దుపాయాల‌పై ఒక జాతీయ స‌ర్వేను నిర్వ‌హిస్తే నిజ‌మైన బండారం బ‌య‌ట‌ప‌డుతుంది.
* జ‌నాభాలో కేవ‌లం రెండు శాతం వున్న ప్ర‌భుత్వోద్యోగులు మిగిలిన 98 శాతం ప్ర‌జ‌ల విస్తృత‌ ప్ర‌యోజ‌నాలను ఎలా త‌మ సొంతం చేసుకోగ‌లుగుతారనే ప్ర‌శ్న చాలా ఏళ్లుగా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో వుంది. మ‌న దేశంలో రాష్ట్రాల ఆదాయంలో స‌గానికి పైగా ప్ర‌భుత్వ ఉద్యోగుల వేత‌నాల‌కే స‌రిపోతోంద‌ని ఒక అంచ‌నా. ఈరోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏ దేశం లోనూ ఇలాంటి ప‌రిస్థితి లేదు. ఉద్యోగుల వేత‌నాల విష‌యంలోనే కాదు, అవినీతిలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలూ అగ్ర‌స్థానంలోనే వున్నాయి.
* జ‌నం మ‌న‌సుల్లో బ‌లంగా వున్న‌దీ అయిన మూడో అంశం – త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాల నిమిత్తం ఇంత ఉద్య‌మ‌స్థాయిలో మాట్లాడుతున్న ఉద్యోగులు … ప‌రిపాల‌న‌లో అవినీతిని నియంత్రించ‌డానికి, స‌జావైన పౌర‌పాల‌న అందించ‌డానికి స‌హ‌క‌రిస్తామ‌ని ఎందుకు హామీ ఇవ్వ‌లేక‌పోతున్నారు? ప్ర‌జ‌ల ప‌న్నుల డ‌బ్బుకు న్యాయంగా వారికి ద‌క్కాల్సిన సేవ‌ల్ని … అవినీతికి, ప‌క్ష‌పాతానికి తావు లేకుండా ద‌క్కేలా స‌హ‌కరిస్తామ‌ని ఎందుకు అన‌లేక‌పోతున్నారు? ప‌్ర‌జాప్ర‌యోజ‌నాల విష‌యంలో రాజ‌కీయ పార్టీల విధానాల కంటే, త‌మ విధినిర్వ‌హ‌ణ‌కే ప్ర‌థ‌మ ప్రాధాన్య‌మిస్తామ‌ని ఎందుకు మాటివ్వ‌లేక‌పోతున్నాయి? కోట్ల రూపాయ‌ల అవినీతి సొమ్ముతో దాడుల్లో ప‌ట్టుబ‌డుతున్న ఉద్యోగుల్ని వెన‌కేసుకొస్తూ, వారిమీద ఎలాంటి కేసులూ పెట్ట‌రాద‌ని ఉద్యోగ సంఘాలెందుకు డిమాండ్ చేస్తున్నాయి?
పై ప్ర‌శ్న‌ల‌న్నీ నాఒక్క‌డివే కాదు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో జ‌వాబుదారీత‌నం దారుణంగా ప‌డిపోయింద‌ని భావించే కోట్ల‌మంది ప్ర‌జలవి. నిజానికి ప‌రిపాల‌నను స‌క్ర‌మంగా వ్య‌వ‌స్థీక‌రిస్తే ప్ర‌భుత్వోద్యోగుల‌కు ఇంత‌కు రెట్టింపు జీతాలిచ్చినా కూడా ప్ర‌జ‌లు ఏమాత్రం ఆక్షేపించ‌రు. త‌మ ప్ర‌యోజ‌నాల కోసం ప‌నిచేసేవారికి నాలుగు రూపాయ‌లు అద‌నంగా ఇచ్చినా న‌ష్టం లేద‌నే భావిస్తారు. కానీ త‌ద్విరుద్ధంగా జ‌రుగుతున్నందువ‌ల్లే దేశవ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో స‌ర్కారీ ఉద్యోగుల‌పై రోజురోజుకీ వ్య‌తిరేక‌త పెరిగిపోతోంది.

ఇవ్వాళ్టికీ నిజాయితీగా విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగులు వేల‌ల్లో వున్నారు. వారికి ఎదుర‌వుతున్న వేధింపులూ త‌క్కువేమీ కాదు. ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లో ఉద్యోగుల పాత్ర త‌న నీలినీడ‌లు వ‌దిలించుకున్న‌ప్పుడు మాత్ర‌మే ఈ దేశంలో ఆఖ‌రి పౌరుడి దాకా ప‌రిపాల‌న ఫ‌లితాలు అందుతాయి. వారు త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం రాజ‌కీయాల ఆశ్ర‌యంతో మ‌నుగ‌డ సాగించినంత‌కాలం మ‌న ప్ర‌జ‌ల‌కు నిజ‌మైన పాల‌న ఎన్న‌టికీ అంద‌ని జాంపండే.

Related posts