telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రచారం పూర్తయ్యింది… ప్రలోభం మొదలయ్యింది

election notifivation by 12th said ec

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పర్వం నేటితో ముగిసింది. నేడు రేపు ఓటర్లను మనీ, మందు తో విందు పార్టీలతో ప్రలోభ పెట్టి, ప్రభావితం చెయ్యడానికి అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలున్నాయి. 25 పార్లమెంట్ స్థానాలున్నాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టాయి. అయితే పోటీ ప్రధానంగా తెలుగు దేశం, జగన్ పార్టీ మధ్యనే. పవన్ కళ్యాణ్ ఏ పార్టీ ఓట్లు చీలుస్తారో అని ఆ రెండు పార్టీలు ఆందోళన పడుతున్నాయి.

నారా చంద్రబాబు నాయుడు అపర చాణుక్యుడులా తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నాడు. రాజకీయ శక్తులన్నీ తనపైన కత్తి కట్టాయని, అయినా ప్రజలు తనని గెలిపిస్తారని ధైర్యంతో వున్నారు. మహిళలలను, యువకులను, వృద్దులను, రైతులను ఆకట్టుకుంటూ తాను ఐదు సంవత్సరాల్లో ఏమేమి చేశాడో, మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమి చెయ్యాలనుకుంటున్నాడో వివరిస్తున్నాడు. జగన్ మోహన్ రెడ్డి గెలిస్తే పాలన అంతా కేసీఆర్ చేతిలోకి వెడుతుందని హెచ్చరిస్తున్నాడు. ఎండల్లో వయసును లెక్క చెయ్యకుండా చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడు.

ఇక వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పధకాలు ప్రకటించాడు. ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి చూడమని అభ్యర్దిస్తున్నాడు. పాదయాత్ర తరువాత జగన్ ప్రచారంలో దూసుకుపోతున్నాడు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ, జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాడు. గతంలో తెలుగు దేశంపై పవన్ విరుచుకపడేవాడు. ఇప్పుడు తెలుగు దేశంపై విమర్శలు సంధించడం లేదు. ఎవరికివారు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ఇది ఆరోగ్యకరమైన చర్య కాదు.

ప్రచారం జోరుగా సాగుతూ వుంది. ప్రజలు కూడా నాయకుల ప్రలోభాలకు లొంగిపోతున్నారు. గెలుపుపై అందరూ ధీమాగానే వున్నారు. ఆంధ్ర ప్రజల నాడి ఏమిటో తెలియకుండా వుంది. పోలింగు దగ్గర పడటంతో అన్ని పార్టీలు ప్రజలను ప్రలోభ పరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పుడు రాజకీయాలు మనీ, మందు చుట్టూ తిరుగుతున్నాయి. ఓటరు కూడా తాత్కాలిక ప్రయోజనమే పరమావధి అనుకుంటూ దీర్ఘకాలిక ప్రయోజనాల సమాధికి పునాది వేసుకుంటున్నాడు.

– భగీరథ

Related posts