ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామలో విషాదం జరిగింది .తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు చూసి, తాను భారం కాకూడదని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
స్థానిక రైతుపేటలో జాస్తి హరిత వర్షిణి అనే విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వర్షిణి ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధించింది. బాలిక తండ్రి ప్రభాకర్‌రావు దిల్లీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు.
కరోనా సమయంలో కుమార్తె చదువు కోసం విజయవాడలోని ఎస్బీఐలో క్రెడిట్ కార్డుపై మూడులక్షల యాబైవేల రూపాయల లోన్ తీసుకున్నారు.
అయితే ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఇప్పటివరకు ఆ లోన్ డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ రికవరీ సిబ్బంది ఫోన్లు చేసి ఒత్తిడి తెస్తున్నారు.
నిన్న (బుధవారం) కూడా బ్యాంక్ సిబ్బంది ఇంటికి వచ్చి లోన్ కట్టాలని ఒత్తిడి చేశారని, అంతేకాదు డబ్బులు కట్టకపోతే కూతుళ్ళని గేదెలు కాయించాలని ఏజెంట్లు ఓ ఉచిత సలహా కూడా కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే బ్యాంక్ సిబ్బంది వేధింపులు భరించలేక మనస్థానంలో అర్ధరాత్రి సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని తన కూతురు ఆత్మహత్య చేసుకుందని హరిత తల్లి ఆరోపిస్తున్నారు.. కూతుళ్ల విషయంలో అవమానకరంగా మాట్లాడారని హరిత తల్లి అంటున్నారు. కూతరు మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా, బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి చేసినట్లు పోలీసులు తెలిపారు. హరిత ఆత్మహత్యతో బ్యాంకు రికవరీ ఏజెంట్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. ఏజెంట్లు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.