అక్క కాపురంలో గొడవలు మొదలు కావడంతో ఆ కాపురాన్ని చక్కదిద్దేందుకు మమత తమ్ముడు మనోజ్ జోక్యం చేసుకున్నాడు. ఈ సందర్భంగా పోలీసులు, పెద్దల వద్దకు వెళ్లి ఫిర్యాదులు అందించాడు. కలిసి చక్కగా కాపురం చేసుకోవాలని బావకు సర్దిచెప్పాడు.
అదే అతను చేసిన పొరపాటైంది. చివరకు బావ చేతిలో హతమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం ఆదిలాబాద్ పట్టణం ఖుర్షీద్ నగర్ కాలనీకి చెందిన ఓసావార్ సంతోష్, మమత దంపతులు. పద్నాలుగేళ్ల క్రితం వీరి పెళ్లి జరగగా పాప, బాబు ఉన్నారు. మమత తమ్ముడు మనోజ్ (27) ఉద్యోగ రీత్యా మహారాష్ట్రలోని దహెల్లిలో ఉంటున్నాడు.
స్థానిక జిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న సంతోష్ కు, మమతకు మధ్య ఏడాది క్రితం మనస్పర్థలు మొదలయ్యాయి. నిత్యం గొడవలు జరుగుతుండేవి. భర్త తీరుతో విసిగిపోయిన మమత పుట్టింటికి వెళ్లిపోయింది.పెద్దల పంచాయతీలతో మొత్తమ్మీద వ్యవహారం చక్కబడింది. తాను మారిపోయానని, ఇకపై ఎటువంటి గొడవలు పడనని చెప్పిన సంతోష్ దహెల్లిలో తమ్ముడి ఇంట్లో ఉన్న భార్య పిల్లలను రప్పించుకున్నాడు. ఆ తర్వాత కూడా మమత ఎప్పటికప్పుడు తన ఇంటి విషయాలు ఫోన్లో తమ్ముడికి చెబుతుండడం సంతోష్ కు నచ్చలేదు. దీంతో అతని పై కక్ష పెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలో నిన్న పని నిమిత్తం స్నేహితుడు సంజీవ్ తో కలిసి మనోజ్ ఆదిలాబాద్ వచ్చాడు. మనోజ్ ను చూడగానే సంతోష్ లోని పాతకక్ష రగిలిపోయింది. దీంతో టీ తాగివద్దాం పదని చెప్పి మనోజ్ ను వెంట తీసుకువెళ్లాడు. కాస్త దూరం వెళ్లాక అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడవబోగా తప్పించుకున్న మనోజ్ పారిపోయాడు. దీంతో వెంటపడి అతని గొంతుకోసి చంపేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.
అప్పుడు తండ్రి ఇప్పుడు కొడుకు.. జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు