telugu navyamedia
సినిమా వార్తలు

దాసరి “ఉదయం” పత్రిక ఎందుకు మొదలు పెట్టాడో తెలుసా ?

దాసరి నారాయణ రావు దక్షిణ భారత దేశంలోనే ఓ లెజెండ్ . ఓ మార్గదర్శకుడు , ఓ స్ఫూర్తి ప్రదాత . అతి చిన్న స్థాయి నుంచి అనూహ్యమైన స్థాయికి ఎదిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి , విమర్శకులు మెచ్చిన ప్రతిభాశాలి . ఆయన జీవితం గురించి చాలా మందికి తెలుసు . అయితే కొద్దీ మందికి మాత్రమే తెలిసిన సంఘటన  ఆయన పట్టుదలకు నిదర్శనం కాగా ఆ పట్టుదల , అవిరళ కృషే వందలమందికి ఉపాధి కలిగించింది . 
Do you know why Dasari started the morning magazine
1980 దశకం . దాసరి నారాయణ రావు దర్శక ప్రతిభ అఖండంగా వెలిగి పోతుంది . ఆయన మూడు షిఫ్టుల్లో పనిచేస్తుండేవారు . ఉదయం 7 . 00 గంటలకు షూటింగ్ మొదలు పెడితే అర్ధరాత్రి వరకు ఆయన దిన చర్య కొనసాగేది . షూటింగ్, పాటల కంపొజింగ్ , రికార్డింగ్, డబ్బింగ్, ఎడిటింగ్ , స్టోరీ సిట్టింగ్ ఇలా సాగిపోతూ ఉండేది. ఇక ఆయనతో సినిమాలు నిర్మించాలని సెట్లో కి నిర్మాతలు క్యూ కట్టేవారు . అప్పుడు సితార , జ్యోతి చిత్ర , సినీ హెరాల్డ్ , వెండితెర , విజయ చిత్ర , సినిమా రంగం మొదలైన పత్రికలు ఉండేవి . 
Do you know why Dasari started the morning magazine
అయితే ఈనాడు సంస్థ నుంచి వెలువడే సితార , ఆంధ్ర జ్యోతి పత్రిక వారి జ్యోతి చిత్ర వార పత్రికలు  అత్యధిక సర్క్యూలేషన్ కలిగి ఉండేవి . నేను అప్పుడు జ్యోతి చిత్ర పత్రిక లో రిపోర్టర్ గా హైదరాబాద్ లో పనిచేస్తూండేవాడిని . దాసరి దిన చర్య మొత్తం కవర్ చెయ్యాలని అప్పటి సితార ఎడిటర్ కొంపెల్ల విశ్వం నిర్ణయించాడు . అందుకు దాసరి అనుమతి ఇచ్చారు . విశ్వం తన టీమ్ తో ఉదయమే దాసరి నారాయణ రావు దిన చర్య కవర్ చెయ్యడాని వెళ్ళాడు . 
Do you know why Dasari started the morning magazine
ఆరోజు అర్ధరాత్రి వరకు విశ్వం , వారి రిపోర్టర్ , ఫోటోగ్రాఫర్  దాసరి నారాయణ రావు వెన్నంటే వున్నారు . ప్రతిదీ ప్రత్యేకంగా తీయించి రిపోర్ట్ రాసుకున్నారు . ఇది తరువాత వారం సితార లో మూడున్నర పేజీల్లో ప్రచురితమైంది . దాసరి నారాయణ రావు చూసి మిక్కిలి  సంతోషించారు . అదే సమయంలో రామోజీ రావు కొంపెల్ల విశ్వం పై మండిపడ్డాడు . అర్జ్గెంట్ గా తన ఛాంబర్ కు పిలిపించి చివాట్లు పెట్టి సంజాయిషీ అడిగారు . సితార లో ఎవరి గురించి అయినా ఒక పేజీ కి మించి పబ్లిసిటీ ఇవ్వకూడదని నిబంధన ఉందట . దానిని విశ్వం అధిగమించాడనే  రామోజీ రావు ఆగ్రహించాడు . 
తరువాత ఏమి జరిగిందో తెలియదు కానీ కొంపెల్ల విశ్వం రాజీనామా చేశాడు . ఈ విష్యం దాసరికి తెలిసి చాలా బాధ పడ్డాడు . విశ్వాన్ని చేరదీసి తన దగ్గర వుద్యోగం ఇచ్చాడు . ఈ ఘటనే  దాసరి ” ఉదయం ” పత్రిక పెట్టడానికి ప్రేరేపించింది . అప్పట్లో పేరున్న ఎబికె ప్రసాద్ ను పిలిపించాడు . సినిమా షూటింగ్ మధ్యలోనే పత్రికపై చర్చలు , సమాలోచనలు తగిన చర్యలు… అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో  ఉదయం పత్రిక శంకుస్థాపన జరిగింది . 1984 డిసెంబర్ లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ .టి రామారావు గారు ఉదయం పత్రిక ను ఆవిష్కరించారు . 
Do you know why Dasari started the morning magazine
ఉదయం కలర్ లో వచ్చింది . అప్పటి వరకు దిన పత్రికలో కలర్ ప్రింటింగ్ లేదు . కాబట్టి ఇదొక సంచలనం . మరో సంచలనం ప్రారంభం రోజునే లక్ష కాపీలను ప్రింటు చేశారు . అనతి కాలంలోనే  2. 24 000 కాపీలకు చేరుకుంది . ఈనాడు 3లక్షలకు పైగా ఉండేది . అంటే ఈనాడుకు పోటీగా వచ్చే పత్రిక ఉదయం  మాత్రమే . అలా దాసరి నారాయణ్ రావు ఉదయం పత్రిక పెట్టి  పత్రికా రంగంలో సంచలనం కలిగించాడు ఈరోజు దర్శకుడు దాసరి నారాయణ రావు జయంతి, బహుముఖ ప్రజ్ఞాశాలి దర్శకరత్న దాసరి నారాయణ రావు 72వ జయంతి .
నిరుపేద కుటుంబంలో మే 4 1947లో పాలకొల్లులో జన్మించిన దాసరి నారాయణ రావు అనేక కష్టాలుపడి , ఎందరో సహాయంతో చదువుకున్నారు . చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఇష్టం . ఆ ఇష్టమే ఆయన్ని సినిమా రంగంలోకి తీసుకు వచ్చింది . దాసరి నారాయణ రావు శ్రీమతి పద్మను వివాహం చేసుకున్న తరువాత ఆయన జీవితం మలుపు తిరిగింది .ప్రతి మగవాడి విజయం వెనుక శ్రీమతి ఉంటుందని పద్మ గారు నిరూపించారు . ఆమెతో మద్రాస్  వెళ్లి రచయితగా , సహాయ దర్శకుడుగా ప్రారంభమైన ఆయన 1972లో “తాతా మనవడు ” సినిమాతో దర్శకుడయ్యారు . 
Do you know why Dasari started the morning magazine
2014లో ఆయన దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం “ఎర్ర బస్సు “. ఇది 140 వ సినిమా. . దాసరి దక్షిణ భారత దేశంలో అగ్రశ్రేణి దర్శకుడు . ముఖ్యంగా తెలుగు సినిమాపై దాసరి వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు . రచయిత , కవి , నిర్మాత , నటుడు, దర్శకుడు, పత్రికాధిపతి , కేంద్ర మంత్రి గా ఆయన బహుముఖాలుగా ఎదిగి ఒదిగిన మహామనిషి . ఆయనతో నాకు 1980 నుంచి అనుబంధం వుంది . సహృదయుడు, సంస్కారి , మానవతావాది అయిన దాసరి 30 మే 2017లో ఇహలోక యాత్ర చాలించారు . దాసరి నారాయణ రావు  లేని లోటు తెలుగు సినిమా రంగంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది .
 
తెలుగు సినిమాకు తనదైన ఓ గుర్తింపు , తెలుగు దర్శక లోకానికి మార్గదర్శకత్వం … ఆయన  పయనించిన తీరు ఎంతో ప్రశంసనీయం ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎలా ఎదగవచ్చో దాసరి నిరూపించారు . దాసరి అంటే ఓ కసి దాసరి అంటే ఓ కృషి … దాసరి అంటే ఓ అనూహ్య విజయం .
-భగీరథ 

Related posts