telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఎఫ్-3″లో సునీల్…?

Sunil

ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరుతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకొని వరుసగా ఐదు హిట్లతో దూసుకెళ్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ దర్శకుడు ఎఫ్ 2 సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పుడు జరుగుతుండగా.. దిల్ రాజు ఈ సీక్వెల్‌ను నిర్మించబోతున్నారు. ఇక ఈ సీక్వెల్‌లో ‘ఎఫ్ 2’లో నటించిన వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కంటిన్యూ అవుతారని.. వారితో పాటు స్టార్ హీరో కూడా భాగం అవుతారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వెంకటేష్, వరుణ్‌తేజ్‌తో అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే ‘ఎఫ్‌3’లో సునీల్ కనిపించబోతున్నారట. ఇద్దరు హీరోలతో కలిసి సినిమా మొత్తం సునీల్ కనిపించేలా దర్శకుడు పాత్రను మలిచినట్లు సమాచారం. కాగా తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యా్క్‌గ్రౌండ్ లేకుండా ఎదిగిన నటుల్లో సునీల్ ఒకరు. సైడ్ ఆర్టిస్ట్‌ నుంచి స్టార్ కమెడియన్‌గా మారిన సునీల్.. ఆ తర్వాత హీరోగా టర్న్ అయ్యారు. మొదట్లో రెండు మూడు హిట్లు సాధించినా ఆ తర్వాత కథల ఎంపికలో అయోమయానికి గురికావడంతో వరుస ప్లాఫులు ఎదురయ్యాయి. దీంతో ఆయనతో హీరోగా అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో మళ్లీ కమెడియన్‌గా యూటర్న్ తీసుకున్న సునీల్ అరవింద సమేత, అల వైకుంఠపురములో, చిత్రలహరి వంటి సినిమాల్లో నటించారు. ఆ సినిమాల్లో మంచి పేరు రావడంతో ఆర్టిస్ట్‌గా మళ్లీ బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సుకుమార్-బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో కీలక పాత్ర కోసం ఆయన్ని తీసుకున్నట్లు సమాచారం.

Related posts