telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రెండు తెలుగు రాష్ట్రాల నీటి వివాదానికి కేంద్రం మధ్యవర్తిత్వానికి సీపీఐ మద్దతు – రాజకీయ ప్రయోజనాల కోసం నీటి అంశాన్ని వాడకండి: నారాయణ

రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని సీపీఐ స్వాగతిస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణఅన్నారు.

ఈరోజు (శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. నదుల్లో రెండు రాష్ట్రాల నీటి వాటాలు తేలాకనే నీటి ప్రాజెక్టులపై ముందుకు వెళ్ళాలని సూచించారు.

రాయలసీమకు నీళ్ళు అవసరం అని తెలిపారు. ఏపీ, తెలంగాణలో నీటి అంశాలను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

టీఆర్ఎస్ బీఆర్‌ఎస్‌గా మారిన తరువాత సెంటిమెంట్ ఎగిరిపోయిందని.. ఇప్పుడు సెంటిమెంట్లు లేవంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రతి అంశంపై సెంటిమెంట్లతో రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ తెలంగాణ సీఎం అని.. ఎన్నుకోబడిన నేత అని నామినేట్ చేయబడిన వ్యక్తి కాదన్నారు. తెలంగాణకు రేవంత్ అన్యాయం చేయలేదని.. పొట్టివాడు గట్టి వాడు అని అన్నారు.

రేవంత్‌ను విమర్శిస్తూ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. నీళ్ళను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడమే అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఏపీ, తెలంగాణ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నీళ్లను అడ్డుకోవద్దన్నారు. రెండు రాష్ట్రాలు నీటి పంపిణీ ప్రాజెక్టులు సమస్యలు పరిష్కరించుకోవాలని సూచనలు చేశారు.

నీటి ప్రాజెక్టుల గురించి సీపీఐ ఎప్పుడూ సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు.

కాళేశ్వరం అవినీతిమయం అయిందని ఆరోపించారు. బనకచర్లపై మొదట మాట్లాడింది తానే అని చెప్పుకొచ్చారు. బనకచర్ల గురించి చంద్రబాబు అతిగా మాట్లాడారన్నారు.

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా బనకచర్లను తెర మీదికి తెచ్చారన్నారు. కాంట్రాక్టర్లు, రాష్ట్రం , కేంద్రం కలిసి ప్రాజెక్టు కడతామని చెప్పారని.. బనకచర్ల గురించి మొదట మాట్లాడాల్సింది తెలంగాణ ముఖ్యమంత్రితో అని.. అలా చేయకపోవడం వల్ల విమర్శలు వచ్చి తెలంగాణ సీఎం వ్యతిరేకించారని చెప్పుకొచ్చారు.

బనకచర్ల ప్రస్తుతం ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు కాదన్నారు. మొదట పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలన్నారు.

బనకచర్ల 80 వేల కోట్ల ప్రాజెక్టు కాదని.. 2 లక్షల కోట్లు అవుతుందని తెలిపారు. వివాద రహితంగా ప్రాజెక్టులు కట్టుకోవాలని నారాయణ సూచనలు చేశారు.

Related posts