telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

తొలి దశలో 375 మందిపై వ్యాక్సిన్ ప్రయోగం!

Corona

దేశంలో ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ విడుదల చేసేందుకు స్వదేశీ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. భారత్ బయోటెక్ తయారుచేసిన స్వదేశీ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ను పరీక్షించేందుకు 1,100 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తొలి, రెండవ దశల్లో వీరిపై ప్రయోగాలు నిర్వహించనున్నట్టు సంస్థ వెల్లడించింది.

తొలి దశలో 375 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నామని తెలిపింది. వారిని 125 మంది చొప్పున మూడు గ్రూపులుగా విభజించి, రెండు డోస్ లు ఇస్తామని వెల్లడించింది. వారిపై వ్యాక్సిన్ పనితీరు సంతృప్తికరంగా ఉంటే, రెండో దశలో 750 మందిపై ప్రయోగాలు జరుపుతామని పేర్కొంది. తొలి దశ వ్యాక్సిన్ ఫలితాలను విశ్లేషించేందుకు కనీసం 28 రోజుల సమయం పడుతుంది.

భారత ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ రావాలంటే, ఈ నెల 18 లోగా తొలి దశ టీకాలను వలంటీర్లకు ఇవ్వాల్సి వుంటుంది. అయితే, తొలి దశ పరీక్షలు విజయవంతమైన వెంటనే వ్యాక్సిన్ ను మార్కెట్లోకి విడుదల చేస్తారా? అన్న విషయమై ఇంతవరకు క్లారీటీ లేదు.

వాస్తవానికి ఏదైనా వ్యాక్సిన్ ను విడుదల చేయాలంటే, మూడు దశల్లో పరీక్షలు జరపాల్సివుంటుంది. ఈ మొత్తం విధానం నెలల తరబడి కొనసాగుతుంది. ట్రయల్స్ నిర్వహించేందుకు ఎంత సమయం పడుతుందని గతంలో మీడియా అడిగిన ప్రశ్నకు, 15 నెలల సమయం పడుతుందని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.

Related posts