telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వారంలో నాలుగురోజులు కరోనా టీకా పంపిణీ

హైదరాబాద్‌ కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 1,213 వ్యాక్సినేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డా.శ్రీనివాస్‌ తెలిపారు. మొదటగా శనివారం 139 సెంటర్లలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తూనే.. త్వరలోనే 1,213 సెంటర్లకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కోఠిలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో డీఎంఈ రమేశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 3.15 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ వివరాలను ‘కో-విన్‌’ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసినట్లు వెల్లడించారు. శనివారం ఒక్కో వ్యాక్సినేషన్‌ కేంద్రంలో 30 మందికి చొప్పున మొత్తం 139 కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బందికి టీకా వేయనున్నట్లు తెలిపారు.ప్రతి వారంలో నాలుగు రోజులు (సోమవారం, మంగళవారం, గురువారం, శుక్రవారం) కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. తద్వారా రాబోయే రెండు వారాల్లో 1,213 సెంటర్ల ద్వారా టీకాను అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.

”మొదటగా ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు టీకా వేస్తూనే ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న సిబ్బందికి కొనసాగిస్తాం. రేపు వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న 139 సెంటర్లన్నీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి మొదలు బోధనాస్పత్రుల వరకు ఉన్న ఆరోగ్య సిబ్బందికి టీకా వేసేలా కార్యాచరణ రూపొందించాం. ఇప్పటివరకు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి 3.84 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులు రాష్ట్రానికి వచ్చాయి. వాటిలో 50వేలకు పైగా డోసులను రాష్ట్రంలోని 33 జిల్లాలకు సరఫరా చేశాం. రాబోయే రోజుల్లో మరిన్ని వ్యాక్సినేషన్ కేంద్రాలకు జనాభా ప్రాతిపదికన సరఫరా చేస్తాం. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైన తర్వాత ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకునేలా నోడల్‌ అధికారులను నియమించాం” అని శ్రీనివాస్‌ తెలిపారు.

Related posts