telugu navyamedia
క్రీడలు వార్తలు

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ముగ్గురికి కరోనా పాజిటివ్…

దేశంలో నెలకొన్న విపత్క పరిస్థితుల నేపథ్యంలో బయో బాబుల్ వాతావరణంలో సాఫీగా సాగిపోతున్న ఐపీఎల్ 2021 లో సోమవారం పెద్ద అలజడి రేగింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారినపడినట్లు ఈరోజు ఉదయం వెలుగులోకి వచ్చింది. ఇది తెలిసిన గంటల వ్యవధిలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ మూడు కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో అందరిలో భయాందోళనలు మొదలయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, సీఈవో కాశీ విశ్వనాథన్‌తో పాటు చెన్నై టీమ్ బస్ క్లీనర్ కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. దాంతో ఈ ముగ్గురినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలో ఉన్న మిగతా జట్టు ఆటగాళ్లు, సిబ్బంది అందరికి నెగటివ్ వచింది. అయితే ముందస్తు జాగ్రత్తలో భాగంగా.. వైరస్ సోకిన ముగ్గురికి ఈ రోజు మరోసారి పరీక్షలు చేయనున్నారు. అప్పుడు కూడా వారికి పాజిటివ్‌ వస్తే.. 10 రోజులు ఐసోలేషన్‌లో ఉంచనున్నారు. అనంతరం రెండు వైరస్ పరీక్షలో నెగటివ్ వస్తే మల్లి బబుల్లోకి వస్తారు. శనివారం ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన త్రిల్లర్ మ్యాచులో భారత మాజీ ఫాస్ట్ బౌలర్, చెన్నై బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ జట్టు డగౌట్‌లో ఉన్నాడు. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కూడా అందరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు బాలాజీకి పాసిటివ్ రావడంతో.. చెన్నై యాజమాన్యం ఆందోళనలో ఉంది. చెన్నై తన తదుపరి మ్యాచ్ మే 5 న ఢిల్లీలో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచుకు రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో.. మ్యాచ్ నిర్వహించాలా వద్దా అనేది బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. ఆ జట్టులో కరోనా కేసులు నమోదవడంతో మ్యాచ్ వాయిదాపడిన విషయం తెలిసిందే.

Related posts