రోజురోజుకూ ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతుంది. ఒకర్ని మించి ఒకరు హామీల వర్షం కురిపిస్తున్నారు . ప్రధాన పార్టీలైన టీడీపీ , వైసీపీకి పోటీగా జనసేన కూడా ముందుకు దూసుకుపోతుంది. ఈసమయంలో పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురి కావటం పార్టీ శ్రేణులను కలవరానికి గురి చేస్తుంది. అందుకే బాబాయికి బాసటగా మెగా హీరో రాం చరణ్ రంగంలోకి దిగుతున్నారు. బాబాయ్ పవన్ కల్యాణ్ కోసం తెలుగు సినిమా హీరో రామ్ చరణ్ తేజ్ ప్రచారం చెయ్యనున్నారు. హైదరాబాద్ నుంచి రామ్ చరణ్ బయలుదేరి విజయవాడ చేరుకొని నేరుగా బాబాయ్ ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు .ఆ తర్వాత తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించి బాబాయ్ పవన్ కళ్యాణ్ వెంట రెండు రోజుల పాటు చెర్రీ రామ్ చరణ్ ఉండనున్నట్టు తెలుస్తుంది.
పవన్‌తో పాటు ఎన్నికల ప్రచారంలో కూడా రామ్‌చరణ్ పాల్గొంటారు. అంతేకాదు బాబాయి నాగబాబు తరఫున కూడా రామ్‌చరణ్ ప్రచారం చేయనున్నారు. ప్రచారంలో పాల్గొనడంతో పాటు చెర్రీ బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఆదివారం, సోమవారం రామ్ చరణ్ ప్రచారం సాగనుంది. ఎన్నికల ప్రచారానికి కేవలం 3 రోజులే సమయం ఉన్న నేపధ్యంలో రామ్ చరణ్ ఎంట్రీ పార్టీలో కొత్త జోష్ నింపుతోంది.
వరుణ్ తేజ్ తన తండ్రి నాగబాబు తరఫున ప్రచారం చెయ్యనున్నారు. ఇప్పటికే నాగబాబు తనయ నటి నిహారిక ప్రచారం చేసింది. అల్లు అర్జున్ మాత్రం తాను ప్రచారానికి రాకపోయినా నాగబాబు, పవన్‌కు పూర్తి మద్దతు ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తానికి మెగా బ్రదర్స్ కోసం మెగా హీరోలు ప్రచారం చేస్తున్న నేపధ్యంలో జనసేన పార్టీలో నూతనోత్సాహం నెలకొంది.