telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ కేసు సీబీఐకి… కేంద్రం గ్రీన్ సిగ్నల్

Sushanth

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి. ప్రస్తుతం సుశాంత్ కేసును ముంబై పోలీసులు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సుశాంత్ కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చేతికి వెళ్లింది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సీబీఐకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ బిహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసును పట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. దర్యాప్తును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయమని ఆదేశిస్తూ రియా చక్రవర్తి వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. తాజా నిర్ణయంతో సుశాంత్ కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్‌కి న్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే సిబిఐ ఇప్పుడు సుశాంత్ కేసు దర్యాప్తు చేయనుంది. సుశాంత్ మరణించిన వెంటనే కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురిని ప్రశ్నించారు. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని కూడా పోలీసులు విచారించారు. ఇప్పటివరకు ముంబై పోలీసులు 56 మందిని ప్రశ్నించారని రియా న్యాయవాది శ్యామ్ దివాన్ వాదించారు. కాబట్టి దర్యాప్తు బాధ్యత ముంబై పోలీసులదేనని సుప్రీంకు తెలిపారు. అయితే ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ చాలా సాక్ష్యాలు మాయమయ్యాయని సుశాంత్ తండ్రి న్యాయవాది వికాస్ సింగ్ అన్నారు. దర్యాప్తులో ముంబై పోలీసులు బిహార్ పోలీసులకు సహకరించడం లేదని వాదించారు. దీంతో సుశాంత్ తండ్రి విజ్ఞప్తి మేరకు బీహార్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు జరపించాలని కేంద్రాన్ని కోరడం జరిగింది. దీనిపై కేంద్రం సైతం సానుకూలంగా స్పందించింది.

Related posts