శ్రీలంక రాజధాని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. వరుస బాంబు పేలుళ్లలో ఈ దాడిలో 42 మంది మృతిచెందగా, 300మందికి పైగా గాయాలయ్యాయి. ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిలకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాడిలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఉగ్రదాడితో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది.ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులనే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడ్డట్లు సమాచారం. మొత్తం ఆరు ప్రాంతాల్లో బాంబులు పేల్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.45 ప్రాంతంలో కొలంబోలోని ఒక చర్చితోపాటు మూడు ఫైవ్ స్టార్ హోటళ్లలో బాంబులు పేలాయి. కొలంబోలోని సెయింట్ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్ సెబాస్టియన్, బాట్టికలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రిలా, సిన్నామన్ గ్రాండ్, కింగ్స్‌బరి హోటళ్లలో పేలుళ్లు సంభవించాయి. ఉగ్రదాడిపై భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. కొలంబోలోని భారత హైకమిషనర్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. బాంబు పేలుళ్లపై అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.