ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు రామచంద్రన్ పిళ్లైతో కలసి కల్వకుంట్ల కవిత తిరుమల ఎందుకు వెళ్లారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. కవిత వాళ్లతో ఎందుకు ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నాడు రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా తిరుమలలో ప్రత్యేక పూజలు చేయించడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లారన్నారు. వారితో పాటు ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులు రామచంద్రన్ పిళ్లై, అభిషేక్ రావులు కూడా వెళ్లారని ఆయన ఫొటోలు మీడియా ముందు ఉంచారు.
లిక్కర్ కుంభకోణంలో సంబంధం లేకపోతే వీరంతా తిరుమలకు ఎందుకు వెళ్లి వచ్చారని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ ఎంపీల ఆరోపణలను ఖండించిన కవిత దీనికి సమాధానం చెప్పాలని రఘునందనరావు నిలదీశారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరమనిషి అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించడంపై.. నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. మరమనిషి అనేది నిషిద్ధ పదమా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. భాజపా ఎమ్మెల్యేల పట్ల అసెంబ్లీలో వివక్ష జరుగుతోందని ఆరోపించారు
ఏ సంప్రదాయం ప్రకారంగా నోటీసులు ఇస్తారో చెప్పాలని కూడా రఘునందన్ రావు అడిగారు. అసెంబ్లీలో మైక్ లు విసిరినప్పుడు, గవర్నర్ కుర్చీనే తన్నినప్పుడు ఈ సభా సంప్రదాయం ఎక్కడికి పోయిందని మంత్రి ప్రశాంత్ రెడ్డిని రఘునందన్ ప్రశ్నించారు.
స్పీకర్ ఇచ్చే నోటీసులను చట్టబద్దంగా ఎదుర్కొంటామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు మరీ రెండ్రోజులే నిర్వహించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారన్నారన్నారు. స్పీకర్ ను ప్రశ్నించడం తప్పా అని రఘునందన్ రావు అడిగారు.
అసెంబ్లీలోని ఎమ్మెల్యేలందరికి ఒకే గౌరవం ఉండాలన్నారు. ఎమ్మెల్యేలు కుర్చీలు వెతుక్కునేలోపుగానే స్పీకర్ నిన్న అసెంబ్లీని వాయిదా వేశారని చెప్పారు. కోట్లాది రూపాయాలు ఖర్చు చేసి అసెంబ్లీ నిర్వహించడం ఇందు కోసమేనా అని ఆయన ప్రశ్నించారు.
ఇకనైనా మత రాజకీయాలు మానుకోవాలి: డీకే అరుణ