సీఏఏ చట్టం ఏ ఒక్క భారతీయుడికి వ్యతిరేకం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఏఏ, ఎన్నార్సీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీఏఏను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని అన్నారు. దేశంలోని శక్తులతోపాటు విదేశీ శక్తులు కలిసి మోదీ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
పోలీసులకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అమానుషమని అన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీల రక్షణ కోసం ఈ చట్టం తీసుకొచ్చామని తెలిపారు. పాకిస్థాన్ లో మైనారిటీల జనాభా మూడు శాతానికి పడిపోయిందని, పాక్ లో మైనారిటీలంతా ఏమయ్యారు? చాలా మందిని హత్య చేశారు. అలాంటి వారిని ఆదుకోవడానికే మన్మోహన్ సింగ్ హయాంలో చట్టం తేవడానికి ప్రయత్నించారు. కానీ, అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదని మంత్రి పేర్కొన్నారు.