మధ్యప్రదేశ్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమల్’ చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, ముగ్గురు ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రి కనిపించకుండా పోయారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ అపహరించిందని, తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సహా ఆ పార్టీ నేతలు ఆరోపించారు. తాము పలుమార్లు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకున్నామని, దీంతో బీజేపీ అప్రజాస్వామిక పద్ధతిలో అధికారంలోకి రావాలని చూస్తోందని అన్నారు. కాగా, నలుగురు ఎమ్మెల్యేలను హరియాణాలోని ఓ హోటల్‌కు, మిగిలిన నలుగురిని బెంగళూరుకు బీజేపీ నేతలు తరలించినట్లు ప్రచారం జరిగింది. వీరిలో నలుగురిని కాంగ్రెస్ నేతలు తిరిగి రప్పించారు. బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో వారు కాంగ్రెస్ సీనియర్ నేతలతో కలిసి భోపాల్ ఎయిర్‌పోర్టులో దిగారు. మిగిలిన నలుగురు కర్ణాటకలోని చిక్కమగళూరు సమీపంలో ఓ రిసార్టులో ఉన్నట్లు సమాచారం. బీజేపీ నేత ఒకరు రెండు చార్టర్డ్ విమానాలు అద్దెకు తీసుకుని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించారని మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్ అన్నారు. వారికి ఒక్కొక్కరికి రూ.35 కోట్లు ఆఫర్ చేసినట్లు ఆరోపించారు. అయితే కాంగ్రెస్ లో అంతర్గత కలహాలను, ఎమ్మెల్యేలను నియంత్రించలేని అశక్తతను తమపైకి నెట్టివేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వీడీ శర్మ అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని, అది కాంగ్రెస్ నేతల వల్లే జరుగుతుందని మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ఇదిలా ఉండగా.. వ్యాపమ్ కుంభకోణాన్ని బయటపెట్టిన విజిల్ బ్లోయర్లలో ఒకరు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రా రూ.100 కోట్లు, మంత్రి పదవి ఆఫర్ చేస్తున్న ఓ వీడియోను విడుదల చేశారు. అయితే ఇది ఫేక్ వీడియో అని బీజేపీ పేర్కొంది. 230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు 114 మంది ఎమ్మెల్యేలుండగా, బీజేపీకి 107 మంది ఉన్నారు. ఇతరుల మద్దతుతో కమల్‌నాథ్ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
పోలవరం దోపిడీకి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం: చంద్రబాబు