బిహార్‌లో సీఎం నితీశ్‌కుమార్ మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఆయన ఆస్తిలో ఇప్పటికి కేవలం రెండు ఆవులు, ఒక ఆవు దూడ మాత్రమే పెరిగాయి. వార్షిక ఆస్తుల ప్రకటనలో భాగంగా మంగళవారం ఆయన తన ఆస్తులతో పాటు తన మంత్రివర్గ సహచరుల ఆస్తుల వివరాలు ప్రకటించగా.. అందులో తన ఆస్తిలో కొత్తగా కేవలం రెండు ఆవులు, ఒక ఆవు దూడ అదనంగా చేరినట్టు తెలిసింది. గతేడాది ఆయన తన ఆస్తుల్లో ఒక ఆవుల షెడ్డు, ఎనిమిది ఆవులు, ఆరు ఆవు దూడలు ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది వాటి సంఖ్య పది ఆవులు, ఏడు ఆవు దూడలుగా చూపించారు. గతేడాది తన వద్ద రూ.42,000 నగదు ఉన్నట్లు చూపిన ఆయన ప్రస్తుతం రూ.38,039 నగదు ఉన్నట్లు చూపించారు. వీటితో పాటు రూ.16లక్షల విలువ కలిగిన చరాస్థులు, దిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని ఫ్లాట్ సహా రూ.40లక్షల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు ఆయన కుమారుడు మాత్రం రూ.1.39 కోట్ల విలువ కలిగిన చరాస్థులు, రూ.1.48 కోట్లు విలువ కలిగిన స్థిరాస్తులు కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ ఆస్తులు ఆయనకు తన తల్లి నుంచి వారసత్వంగా సంక్రమించినట్టు ప్రకటించారు. 2010 నుంచి నితీష్ కుమార్ తనతో సహా తన మంత్రివర్గ సహచరుల ఆస్తుల వివరాలు ప్రతి ఏడాది ప్రకటించడం ఆనవాయితీగా వస్తుంది. తన మంత్రి వర్గ సహచరులు చాలా మంది తన కన్నా ఎక్కువ ఆస్తులు కలిగి ఉండటం గమనార్హం.
బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ తన ఆస్తుల విలువ రూ.1.26 కోట్లుగా ప్రకటించారు. ప్రొఫెసర్ అయిన తన భార్య పేరు మీద రూ.1.65కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. తన బ్యాంకు ఖాతాలో రూ.81.54లక్షల నగదు, తన భార్య ఖాతాలో రూ. 97.18లక్షల నగదు ఉన్నట్లు ప్రకటించారు. నితీష్ మంత్రి వర్గంలోనే ధనిక మంత్రిగా సురేష్ శర్మ ఉన్నారు. ఆయన తన ఆస్తుల విలువ రూ.9 కోట్లుగా ప్రకటించారు. మరో మంత్రి వర్గ సహచరుడు నీరజ్ కుమార్ రూ. 35.87లక్షల ఆస్తులతో, రూ.27లక్షల అప్పుతో చివరి స్థానంలో నిలిచారు. గత సంవత్సరం కొత్తగా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న మరో మంత్రి సంజయ్ ఝా మొత్తం తన ఆస్తుల విలువ రూ.22 కోట్లుగా ప్రకటించారు. అయితే అవి తనతో పాటు తన భార్య సమష్టి ఆస్తులుగా పేర్కొన్నారు. ఇవి కాకుండా దిల్లీలోని రెండు షాపింగ్ మాల్స్‌లో కొన్ని దుకాణాలు వారి పేరు మీద ఉన్నట్లు తెలిపారు.