ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యాకు ప్రత్యేక కోర్టు గట్టి షాకిచ్చింది. విజయ్ మాల్యా ఆస్తులను విక్రయించడానికి బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. రుణాలను ఇచ్చి నష్టపోయిన బ్యాంకులు, జప్తులో ఉన్న ఆయన ఆస్తులను అమ్మి తమ సొమ్మును రికవరీ చేసుకోవడానికి అనుమతించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వర్గాలు వెల్లడించాయి. మనీలాండరింగ్ కేసులను విచారించే ముంబైలోని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ న్యాయస్థానం ఈ విధంగా ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన బ్యాంకులు బాంబే హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా తమ తీర్పును జనవరి 18 వరకు వాయిదా వేసినట్లు కోర్టు స్పష్టం చేసింది.
2013 నుంచి 11.5శాతం వడ్డీతో సహా తమకు రావాల్సిన రూ.6203.35 కోట్ల మొత్తాన్ని రాబట్టేందుకు విజయ్ మాల్యా ఆస్తులను విక్రయించడానికి అనుమతించాల్సిందిగా బ్యాంకులు ఇప్పటికే కోర్టును కోరాయి. అయితే, జప్తు చేసిన మాల్యా ఆస్తులను ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం విక్రయించుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదని గత ఫిబ్రవరిలో సంబంధిత న్యాయస్థానానికి తెలిపింది. ఈ నేపథ్యంలో బ్యాంకుల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయస్థానం.. తాజాగా ఈ మేరకు తీర్పు వెల్లడించింది. జప్తు చేసిన ఆస్తులు ముఖ్యంగా షేర్ల వంటి సెక్యూరిటీల రూపంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మాల్యా తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ మాట్లాడుతూ.. యూబీహెచ్ఎల్ ఆస్తులకు సంబంధించి షేర్ల అటాచ్‌మెంట్ ఎత్తివేయాలని కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల కాపీ వచ్చిన తర్వాత ఈ విషయంపై స్పష్టత వస్తుందని చెప్పారు. గత ఏడాది జనవరి 5న విజయ్ మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించిన విషయం తెలిసిందే. మాల్యా ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించింది.
చంద్రబాబుకు ఓటేస్తే..అన్నీ ప్రైవేట్ పరం: జగన్