మహారాష్ట్రలోని భీవండిలో నిన్న తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఇప్పటి వరకు 20 మందిని శిథిలాల నుంచి రక్షించాయి. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. ఇది విచారకరమని, బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు, బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున సాయం అందించనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. భవనం శిథిలావస్థకు చేరుకోవడం వల్లే కుప్పకూలినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.