telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వినూత్నమే ‘విజయ’ బాపినీడు సూత్రం

Vijayabapineedu

రచయితగా, సంపాదకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా బహుముఖ సేవలందించిన బాపినీడు. ‘శ్యాంప్రసాద్‌ ఆర్ట్స్‌’ పేరుతో చలన చిత్రాలను నిర్మించి,  ఇరవైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. చిరంజీవి స్టార్‌ ఇమేజ్‌కి దోహదం చేసిన ‘ఖైదీ నెం.786’, ‘గ్యాంగ్‌  లీడర్‌’ చిత్రాలకు ఆయనే దర్శకుడు. ‘మగధీరుడు’, మగమహారాజు’, ‘మహానగరంలో మాయగాడు’,  ‘హీరో’, ‘కృష్ణ గారడీ’, ‘భార్యామణి’, ‘నాకూ పెళ్లాం కావాలి’, ‘మహాజనానికి మరదలుపిల్ల’, ‘వాలు జడ తోలు బెల్టు’, ‘సీతాపతి ఛలో తిరుపతి’, ‘దొంగకోళ్లు’, ‘జూలకటక’, ‘బిగ్‌బాస్‌’, ‘ఫ్యామిలీ’ తదితర చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని చాటపర్రులో 1936 సెప్టెంబరు 22న జన్మించారు బాపినీడు. (22 సెప్టెంబరు 1936 – 11 ఫిబ్రవరి 2019) ఆయన అసలు పేరు గుత్తా బాపినీడు. తన భార్య విజయ పేరుని ముందు చేర్చుకుని విజయబాపినీడు అయ్యారు. డిగ్రీ పూర్తి చేసి కొంతకాలం ప్రజా ఆరోగ్య శాఖలో పనిచేశారు. చిన్నప్పటి నుంచీ సాహిత్యం అంటే మక్కువ. ఆ ఇష్టంతో కొన్ని రచనలు చేశారు. ఆ అభిరుచే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఎక్కువగా డిటెక్టివ్‌ నవలలు రాసేవారు. నవలలకు పెట్టే పేర్లు చిత్ర విచిత్రంగా ఉండేవి. ఆ తరవాత ‘బొమ్మరిల్లు’, ‘విజయ’ పత్రికల్ని స్థాపించారు. బాపినీడు కథలు కొన్ని సినిమాలుగానూ తెరకెక్కాయి. మిత్రుడు మాగంటి రవీంద్రనాథ్‌ చౌదరితో కలసి ‘శ్యాంప్రసాద్‌ ఆర్ట్స్‌’ సంస్థను స్థాపించారు. ‘యవ్వనం కాటేసింది’, ‘విజయ’, ‘బొమ్మరిల్లు’ చిత్రాల్ని నిర్మించి విజయాలు అందుకున్నారు. కొన్ని అనువాద చిత్రాల్నీ  విడుదల చేశారు. చిరంజీవి నటించిన ‘మగమహారాజు’తో దర్శకుడిగా మారారు. చిరంజీవితో పరిచయం ఆయన ప్రయాణాన్ని మలుపు తిప్పింది. వీరి కలయికలో వచ్చిన ఆరు చిత్రాలూ మెప్పించాయి. ‘కొడుకులు’ (1994) తరవాత ఆయన చలన చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడడం వల్ల జ్ఞాపక శక్తి నశించింది.

Vijayabapineedu

మధ్యతరగతి కథలే
విజయబాపినీడు ఎంచుకున్న కథలన్నీ మధ్యతరగతి మందహాసాలే. వాళ్ల జీవితాల్ని వెండి తెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నించేవారు. అందులోనే హీరోయిజాన్ని తెలివిగా మిళితం చేసేవారు. కుటుంబ కథకు వినోదం, మాస్‌ అంశాలు జోడించడంలో ఆయన సిద్ధహస్తుడు. స్వతహాగా రచయిత కాబట్టి కథకుల్ని ఆదరించేవారు. ఎక్కడ మంచి రచయితలున్నారో అన్వేషించి వాళ్లందరికీ తన బృందంలో చోటు కల్పించేవారు. పాటల రచయితగా భువనచంద్రనీ, మాటల రచయితగా  కాశీవిశ్వనాథ్‌ని పరిచయం చేసింది ఈయనే. ఎం.వి.రఘు, మహీధర్‌, శ్రీనివాసరెడ్డి, బాబు, ప్రసాద్‌లకు ఛాయాగ్రాహకులుగా తొలి అవకాశం ఇచ్చారు. విజయబాపినీడు ఆధ్వర్యంలోనే ప్రముఖ దర్శకుడు మౌళి అరంగేట్రం చేశారు.

Vijayabapineedu

చిరంజీవితో విజయబాపినీడు అనుబంధం ప్రత్యేకమైంది. వీరి కలయికలో వచ్చిన ‘ఖైదీ నెం.786’, ‘గ్యాంగ్‌లీడర్‌’ గుర్తుండిపోయాయి. ‘గ్యాంగ్‌ లీడర్‌’తో చిరు నెంబర్‌ వన్‌ కథానాయకుడిగా మారిపోయారు. ఆ సినిమాలో పాటలన్నీ హిట్టే. ఆ చిత్రంలో చిరు ధరించిన చొక్కాలు ఓ ట్రెండ్‌గా మారాయి. ఈ సినిమా వంద రోజుల పండగనూ కొత్తగా జరిపారు. ఒకేరోజు నాలుగు ప్రధాన పట్టణాల్లో శతదినోత్సవాన్ని నిర్వహించారు. ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్‌ చేశారు. ‘బిగ్‌ బాస్‌’ తరవాత ఆయన చిరంజీవితో సినిమా చేయలేదు. కాకపోతే… అందుకు ప్రయత్నాలు భారీగానే జరిగాయి. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఓ సినిమా నిర్మించాలని చాలా ప్రయత్నించారు. కొన్ని కథలు విన్నా సాధ్యం కాలేదు. ‘మనసంతా నువ్వే’తో గుర్తింపు తెచ్చుకున్న వి.ఎన్‌.ఆదిత్య దర్శకత్వంలో చిరంజీవితో ఓ చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. ఓ దశలో ‘చిరంజీవికి సరిపడ కథలు కావాలి’ అని పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. ‘చిరంజీవి’ అనే పేరుతో ఓ పత్రిక నడిపారు బాపినీడు. అందులో ప్రతి పేజీ చిరు కోసమే. సరదా ఇంటర్వ్యూలు, చిరంజీవికి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారంతో పత్రికని తీసుకొచ్చేవారు. అప్పట్లో అత్యంత ఖరీదైన పత్రికల్లో అదొకటి. డిమాండ్‌ ఉన్నా, దాన్ని నిర్వహించడం వీలుకాక మధ్యలోనే ముద్రణ ఆపేశారు. ‘‘నా మనసుకి అత్యంత దగ్గరైన వ్యక్తి బాపినీడు. ఓ తమ్ముడిలా, కొడుకులా చూసుకునేవారు అన్నారు మెగాస్టార్. మా అనుబంధం చాలా ప్రత్యేకమైంది. ‘మగమహారాజు’ వందరోజులు ఆడిన సందర్భంగా నాకు ఓ ఏనుగును బహుమతిగా ఇచ్చారు. ‘మీమీద ఉన్న ప్రేమకు ఇవ్వగలిగిన కానుక ఇదొక్కటే’ అన్నారు. ‘మిగిలిన కథానాయకులతో కూడా సినిమాలు చేయొచ్చు కదా’ అని అడిగినప్పుడల్లా ‘మీ దగ్గర పనిచేయడం ద్వారా వచ్చే ఆనందం, ఆ సౌకర్యం ఇంకెక్కడా దొరకదు’ అని చెప్పేవారు.

Vijayabapineedu

వినూత్నమే ‘విజయ’ సూత్రం
రచయితగా, దర్శకుడిగా బాపినీడును విజయతీరాలకు చేర్చింది.. వినూత్నమైన ఆలోచనలే. పదిమంది నడిచే దారి కాకుండా కొత్త మార్గాన్ని ఎంచుకోవడం ఆయనకు ముందు నుంచీ ఉన్న అలవాటు. ‘బొమ్మరిల్లు’, ‘విజయ’ పత్రికలు విజయపథం వైపు నడిచాయంటే కారణం.. విజయబాపినీడు ఆలోచనలే. అప్పట్లో ‘విజయ’ పత్రిక ఓ సంచలనం. పత్రిక ఒక్కటే.. కానీ విడదీస్తే అయిదు భాగాలుగా మారిపోయేది. సినిమా, నవల, వినోదం, సీరియల్‌, కథలు.. ఇలా ఎవరికి కావల్సింది వాళ్లు చదువుకోవచ్చు. ఇప్పుడు సినిమా రేటింగులు మామూలు విషయం. అప్పట్లో ఈ ఆలోచనకు నాంది పలికిన వారిలో బాపినీడు కూడా ఉన్నారు. తన పత్రికల్లో సినిమా సమీక్షలు రాసేవారు. ప్రతి సినిమాకీ రేటింగు ఇచ్చేవారు. ఆ రేటింగుల కోసం పత్రిక వచ్చేవరకూ ఆసక్తిగా ఎదురుచూసేవారు సినీ అభిమానులు. తన సొంత సినిమా అయినా సరే, తప్పొప్పుల్ని సమీక్షించడంలో రాజీ పడేవారు కాదు. కె.బాలచందర్‌ దర్శకత్వంలో రూపొందిన ఓ చిత్రాన్ని ‘మన్మథలీల’ పేరుతో తెలుగులో అనువదించారు. ఎడిటింగ్‌ రూమ్‌లో కూర్చుని కొన్ని సన్నివేశాల్ని తొలగించి, స్క్రీన్‌ ప్లే మార్చి విడుదల చేశారు. అప్పట్లో ఓ అనువాద చిత్రానికి ఇంత హంగామా చేయడం అదే తొలిసారి. ‘మన్మథలీల’ విడుదలై, విజయవంతమైన తరవాత ఈ చిత్రాన్ని బాలచందర్‌ చూసి, విజయబాపినీడుని అభినందించారు. ఒక కన్నడ చిత్రం, ఓ మలయాళ చిత్రం కొన్న బాపినీడు.. ఆ రెండింటినీ ఒకేసారి తెలుగులో డబ్‌ చేశారు. కొన్ని సన్నివేశాల్ని కొత్తగా తెరకెక్కించి, రెండు సినిమాల్ని కలిపి ఒకే సినిమాగా విడుదల చేశారు. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఇదో వినూత్న ప్రయోగం. ఎన్ని సినిమాలు చేసినా నిర్మాత అనే పదం ఎక్కడా వాడలేదు. ‘నిర్మాణత’ అనే టైటిల్‌ కార్డు మాత్రం వేసుకునేవారు. తన సినిమాకి సంబంధించిన ప్రచారం కూడా చాలా వినూత్నంగా చేసేవారు. ఆ ప్రకటనల కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసేవారు.

Related posts