telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

భగీరథ “నాగలాదేవి ” యువతకు మార్గదర్శనం

శ్రీ భగీరథ గారి కలం నుంచి జాలువారిన పరిశోధనాత్మక గ్రంథం ‘నాగలాదేవి ‘, శ్రీకృష్ణదేవరాయల ప్రేమకథ పుస్తకాన్ని పరిశీలించాను. ఎంతో ఆనందం కలిగింది. శ్రీ రాయలవారి రెండవ భార్య అయిన శ్రీమతి చిన్నాదేవితో రాయల అనుబంధాన్ని ఈ పుస్తకం ఆవిష్కరించింది. చరిత్రలో కనుమరుగైన ఎన్నో విశేషాలను ఓ ప్రత్యేకమైన దృష్టి కోణంలో వారు ప్రపంచానికి తెలియచేసేందుకు ప్రయత్నించిన తీరు, భగీరథ గారు ఉపయోగించిన సరళమైన భాష ఈ తరానికి శ్రీ రాయలవారిని తెలియజేస్తాయి.
శ్రీకృష్ణదేవరాయాలంటే వ్యక్తిగతంగా నాకెంతో అభిమానం. ఆంధ్రభోజునిగా, సాహితీ సమరాంగణ సార్వభౌమునిగా కీర్తినార్జించిన శ్రీకృష్ణదేవరాయలు కవి పండిత పోషకుడు. రణరంగంలో వీర విజృంభణతో పాటు సాహితీ రంగంలో విజయ విజృంభణ చేసిన కవిరాజు. అయితే ఈ పుస్తకం వారి జీవితంలో మరో కోణాన్ని కూడా మనకు తెలియజేస్తుంది. ఎంతో మంది రాజులు ఈ నేలను పాలించి, చరిత్ర పుటల్లో కలసిపోగా, రాయలు మాత్రం రాజుగా, కవిరాజుగా, సాహితీ పోషకుడుగా, కళాకారుడిగా, సామాజిక సంస్కర్తగా, తెలుగు సాహిత్య చరిత్రలో స్వర్ణయుగ కర్తగా నిలిచిపోయారు .


రాయలవారి ప్రేమను సమగ్రంగా ఆవిష్కరించే ఈ నవలలో శ్రీమతి చిన్నాదేవి కోసం మాత్రమే కాకుండా, సమాజంలో వున్న హెచ్చు తగ్గులకు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం మనకు కానవస్తుంది. శ్రీమతి చిన్నాదేవి అసలుపేరు నాగలాదేవి అని ఈ తరం వారిలో చాలా మందికి తెలియదు. రాయలవారి తల్లి పేరు శ్రీమతి నాగాంబ కావడం వల్ల చిత్తూరు జిల్లాలోని నాగలాపురం, హంపి నగర శివారులో వున్న నాగలాపురం ను ఆయన తల్లి పేరుతో నిర్మించారని చాలామంది భావిస్తారు. అయితే వీటి వెనుక అసలు కథ ఈ పుస్తకం ద్వారా మనకు తెలుస్తుంది .
చరిత్ర అనేది కట్టు కథల సంగమం అని కొంతమంది భావిస్తుంటారు. అయితే చరిత్రలోని వాస్తవాలను బయటకు తీసి, వక్రీకరణలకు స్వస్తి చెబుతూ నిజా నిజాలను నిగ్గుతేలిస్తే ఇలాంటి సందేహాలు పటాపంచలవుతాయి. రాయల వారి జీవితానికి సంబంధించి అనేక వక్రీకరణల వెనుక వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం ఈ నవల చేసింది .
ముఖ్యంగా ఈ తరం యువత వాస్తవమైన చరిత్ర తెలుసుకోవలన్నది నా ఆకాంక్ష. ఈ మార్గంలో ఇలాంటి పుస్తకాలు వారికి మార్గదర్శనమ్ చేయగలవని ఆశిస్తున్నాను. చక్కని భాషలో, రేఖా చిత్రాలతో శ్రీకృష్ణదేవరాయలవారి జీవితాన్ని ఈ పుస్తకం ద్వారా పరిశోధనాత్మకంగా ఆవిష్కరించే ప్రయత్నం చేసిన శ్రీ భగీరథ గారిని అభినందిస్తూ, వారి నుంచి భవిష్యత్ లో ఇలాంటి మరిన్ని పుస్తకాలు రావాలని ఆకాంక్షిస్తున్నాను .

– ముప్పవరపు వెంకయ్య నాయుడు

(అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు నాగలాదేవి పుస్తకానికి రాసిన ముందుమాట)
నాగలాదేవి పుస్తకం కావలసినవారు :
అచ్చ తెలుగు యాప్ : 85588 99478,
నవోదయ బుక్ హౌస్ : 92474 71361 / 92474 71362
సంప్రదించండి

Related posts