telugu navyamedia
సినిమా వార్తలు

“సినిమావాళ్లను బొట్టుపెట్టి పిలవను” – ఎన్.టి రామారావు

NTR

ముప్పై మూడు సంవత్సరాలక్రితం ఇదే రోజు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నందమూరి తారక రామారావు గారిని ఇంటర్వ్యూ చేసిన మధుర జ్ఞాపకం.
అప్పుడు నేను ఆంధ్రజ్యోతి సంస్థ నుంచి వెలువడే సినిమా పత్రిక జ్యోతి చిత్ర వార పత్రికకు హైదరాబాద్ కార్యాలయంలో ఇంచార్జి గా ఉండేవాడిని.
హైద్రాబాద్ లో జరిగే ప్రతి సినిమా కార్యక్రమానికి నేను హాజరయ్యేవాడిని. సినిమా వార్తలన్నీ విజయవాడకు పంపించేవాడిని.
ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉండేది.

NTR 3

రామారావు గారితో అంతకు ముందు ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా ముఖ్యమంత్రి అయిన తరువాత రామారావు గారిని కలవాలన్నా, ఇంటర్వ్యూ కావాలన్నా పి.ఆర్.ఓ ద్వారా వెళ్ళాల్చిందే. అది తప్పనిసరి.
1982లో రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి మార్చి 29న తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. అప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మ్రోగించింది.
1983 జనవరి 9న రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఫిబ్రవరిలో నాకు ముఖ్యమంత్రి హోదాలో ఇంటర్వ్యూ ఇచ్చారు.
అప్పుడు ముఖ్యమంత్రి ఎన్.టి రామారావు పౌర సంబంధాల అధికారిగా గోటేటి రామచంద్ర రావు గారు ఉండేవారు.
ఆ తరువాత కూడా మూడు నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి రామారావు గారితో ఇంటర్వ్యూ లు చేశాను.

NTR 1

1986లో జ్యోతి చిత్ర వార పత్రిక పదవ సంవత్సరం సందర్భంగా ఒక ప్రత్యేక సంచిక తీసుకువద్దామని సంకల్పించారు. అప్పుడు తుర్లపాటి కుటుంబరావు గారు ఎడిటర్ గా, మోహన్ కుమార్ గారు అసోసియేట్ ఎడిటర్ గా ఉండేవారు. హైదరాబాద్ నుంచి ఎన్.టి.రామారావు గారు, అక్కినేని నాగేశ్వర రావు గారి ఇంటర్వ్యూ లు తప్పకుండా వుండాలని, వెంటనే వారి ఇంటర్వ్యూలు పంపమని నాకు చెప్పారు. నాగేశ్వరరావు గారి ఇంటర్వ్యూ కష్టం కాదు.
అందుకే ముందు రామారావు గారి ఇంటర్వ్యూ కోసం గోటేటి రామ చంద్ర రావు గారిని సంప్రదించాను. వారు రెండు రోజుల్లోనే రామారావు గారితో ఇంటర్వ్యూ డేట్ చెప్పారు. అదే మార్చి 26వ తేదీ, ఉదయం 5.30 గంటలకు. ఆరోజు హోలీ పండుగ.

NTR4
ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేవాలి. నాలుగున్నర కల్లా రెడీ కావాలి. అప్పుడు సుధాకర్ అనే ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. అతనికి స్కూటర్ వుంది.
అతను కూడా చిక్కడపల్లిలోనే ఉండేవాడు.
మేము ఉదయం ఐదు గంటలకు అబిడ్స్ లో వున్న ముఖ్యమంత్రి రామారావు గారి నివాసానికి వెళ్ళాము. అక్కడ గేట్ దగ్గర నాలుగురైదుగు పోలీసులు వున్నారు. మా అపాయింట్మెంట్ అక్కడున్న రిజిస్టర్ లో నోట్ చేసి వుంది. పోలీసులు మమ్మల్ని లోపలకు తీసుకెళ్లి హాల్లో కూర్చోమన్నారు.
అప్పటికే రామచంద్ర రావు గారు వచ్చారు. కాసేపటికి వేడి కాఫీ వచ్చింది.
కరెక్టుగా 5.30 గంటలకు రామారావు గారి గదిలోకి రమ్మని పిలుపు వచ్చింది.
లోపలకు వెళ్ళగానే గదంతా సామ్రాణి పొగతో నిండిపోయింది. రామారావు గారు నుదుటిపై విభూది పెట్టోకొని కడిగిన ముత్యంలా కనిపించారు.

NTR
“నమస్కారం సార్” అన్నాను చేతులు జోడిస్తూ. రామారావు గారు కూడా “నమస్కారం బ్రదర్ రండి”అని ఆహ్వానించారు.
ఆ సంవత్సరం జనవరిలో ఫిల్మోత్సవ్ 86 అద్భుతంగా నిర్వహించారు. అప్పటివరకు దేశంలో ఎన్ని ఫిల్మోత్సవాలు జరిగినా హైదరాబాద్ లో జరిగిన ఫిల్మోత్సవ్ మాత్రం ఊహించని పేరు తెచ్చిపెట్టింది. డీవీఎస్ రాజు, విశ్వేశ్వర రావు, దాసరి నారాయణ రావు తదితరులు అందించిన సహకారంతో రామారావు గారు స్వయంగా పూనుకొని చిరస్మరణీయంగా జరిపించారు. రాజ్ కపూర్, అశోక్ కుమార్, ఎమ్ జి రామచంద్రన్, కన్నడ రాజ్ కుమార్ మొదలైన ఉద్దండులైన వారు ఫిల్మోత్సవ్ కు హాజరయ్యారు. అబిడ్స్ లోని రామకృష్ణ థియేటర్ కాంప్లెక్స్ ప్రధాన వేదిక. జూబిలీహాల్ మీడియా సెంటర్.
ఫిల్మోత్సవ్ ఒక పండుగలా జరిగింది.
ఆ విషయాన్ని గుర్తు చేసినప్పుడు ఆయన చిరునవ్వుతో “తెలుగువారి సత్తా ఏమిటో చూపించాము బ్రదర్ “అన్నారు.
ఆ తరువాత మా ఇంటర్వ్యూ మొదలైంది.

NTR“తెలుగు సినిమా రంగానికి కావలసిన ప్రాధమిక సౌకర్యాలు కలిపిస్తాము. అంతేతప్ప ఎవరినీ బొట్టు పెట్టి పిలవం. స్వరాష్ట్రం పట్ల అభిమానం వున్నవారు వస్తారు” అంటూ తెలుగు సినిమాను మద్రాస్ నుంచి హైద్రాబాద్ కు తరలించే విషయం గురించి తన అభిప్రాయం చెప్పారు.
ఇక అక్కినేని నాగేశ్వరరావుతో అన్నపూర్ణ స్టూడియోస్ ను వేరే దాని కోసం వాడుతున్నారని ఆ స్టూడియోస్ కు ప్రభుత్వం నోటీసు పంపించింది.
ఈ విషయం గురించి అడిగినప్పుడు “నాగేశ్వరరావుతో నాకు అభిప్రాయభేదాలు లేవు. అందరూ నాకు సోదరులే. ముఖ్యమంత్రిగా అందరినీ గౌరవిస్తా” అని చెప్పారు. మహాకవి శ్రీనాథ కవి సార్వ భౌముడు సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో పాటలు రికార్డు చేశానని చెప్పారు.
ఇక బాలకృష్ణ గురించి తాను ఎలాంటి సలహాలు ఇవ్వనని, అతను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాడని పేర్కొన్నారు.
నిజానికి నాకు అధికారికంగా కేటాయించిన సమయం 15 నిముషాలే. అయితే నేను 45 నిముషాలపాటు ఇంటర్వ్యూ చేశాను.
అంతసేపు రామారావు గారు ఇంటర్వ్యూ ఇచ్చారంటే కేవలం సినిమా రంగం అంటే వారికున్న మమతానురాగాలే.
నిజంగానే నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాతుడే !

-భగీరథ

Related posts