విజయవాడ కనకదుర్గమ్మను నందమూరి బాలలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో బాలయ్యకు, బోయపాటి స్వాగతం పలికారు దుర్గ గుడి అధికారులు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలకృష్ణకు అమ్మవారి చిత్రపటంతో పాటు వేద ఆశ్వీర్వచనం అందించారు అర్చకులు.
‘అఖండ’ సినిమా ఘనవిజయం సాధించడం పట్ల హీరో బాలయ్య ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మీడియా మాట్లాడుతూ.. మంచి సినిమాను ప్రజలు ఆధారిస్తారని అన్నారు. సనాతన ధర్మాన్ని చూపించిన సినిమా ‘అఖండ’ అని.. అమ్మవారి ఆశీస్సులతో ప్రేక్షకులు విజయాన్ని అందించారని బాలకృష్ణ పేర్కొన్నారు.
ఏపీలో టికెట్ రేట్లపై, ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టికెటింగ్ విధానంపై బాలకృష్ణ మాట్లాడారు. టికెట్ రేట్లపై ప్రభుత్వం సుప్రీంకు వెళ్తే.. నిర్మాతలు కూడా వెళ్తారని బాలకృష్ణ చెప్పారు. తాము అన్నింటికీ సిద్ధమయ్యే సినిమా విడుదల చేశామని.. టికెట్ ధరలపై హైకోర్టు తీర్పు రాకున్నా ధైర్యంతో అఖండ రిలీజ్ చేసినట్లు తెలిపారు. న్యాయ నిర్ణీత దేవుడే.. దేవుడున్నాడని చెప్పుకొచ్చారు. చిత్ర పరిశ్రమను తప్పకుండా కాపాడతామని బాలయ్య తెలిపారు.
‘అఖండ’ విడుదలై ఘన విజయం సాధించాక నిర్మాతలకు ధైర్యం వచ్చిందన్న బాలయ్య.. అందరూ సినిమాలు విడుదల చేసేందుకు..ముందుకొస్తున్నారని వివరించారు. ‘అఖండ’ సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకి కృతజ్ఞతలు తెలిపారు బాలయ్య.
అలాగే..మల్టీస్టారర్ మూవీ చేయడంపై స్పందించారు “సినిమా కథ బాగుంటే ఖచ్చితంగా మల్టీస్టారర్ చేస్తాను. సరైన కాస్టింగ్ ను బట్టి నిర్ణయం తీసుకుంటాము. అంతా అమ్మవారు ఇచ్చిన ప్రేరణ… నేను మల్టీస్టారర్ చేయడానికి నేను ఎప్పుడూ కాదనలేదు. కానీ అవతలి వారికి ధైర్యం ఉండాలి కదా… నాకైతే ధైర్యం ఉంది. నేను మల్టీస్టారర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని తెలిపారు.