‘హాయిహాయిగా ఆమని పాడే..’ జీవితమే సఫలమూ – రాగ సుధా భరితమూ’, చెట్టులెక్కగలవా నరహరి – పుట్టలెక్కగలవా.. పందిట్లో పెళ్లవుతోంది. వంటి పాటలు వింటుంటే శ్రోతలు అప్పుడే కాదు ఇప్పుడూ మైమరచిపోతారు. అంతటి మధురస్వరం ఆమెది. ఆమె పేరు జిక్కీ. పిల్లవలు గజపతి కృష్ణవేణి లేదా జిక్కీ జయంతి ఈరోజు.. (3 నవంబరు 1935) ఈమె అసలు పేరు పిల్లపాలు గజపతి కృష్ణవేణి. ఇలా పిలిస్తే ఎవరికీ తెలియదు కానీ పిజి కృష్ణవేణి అంటే పాతతరం వాళ్లకి కొందరికి తెలుస్తుంది. అయితే సింగర్ జిక్కీ అంటే మాత్రం అప్పుడూ, ఇప్పుడూ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే తన కమ్మని పాటలతో అన్ని తరాల శ్రోతల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 2001లో సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ‘మురారి’లో ఆమె పాడిన అలనాటి బాలచంద్రుడు పాట ఈ తరాన్ని కూడా అలరించింది.
ఒకసారి వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లాకు చెందిన కృష్ణవేణి కుటుంబం బతుకు తెరువు కోసం మద్రాసు చేరుకుంది. ఆమె శాస్త్రీయ సంగీతం ఏమీ నేర్చుకోలేదు. అయితే బంధువు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కంపోజిటర్ గా పనిచేయడం వలన ఆమెకు కలిసి వచ్చింది. నిజానికి గాయనిగా కాకుండా నటిగా చిత్ర సీమలో తొలిఅడుగు వేసింది. 1948లో వచ్చిన జ్ఞాన సుందరి సినిమాలో కృష్ణవేణి పాడిన పాట సూపర్ డూపర్ అవ్వడంతో అప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్ దృష్టి ఆమె గొంతుపై పడింది.
దీంతో ఆమె వెనక్కి తిరిగిచూసుకోలేదు. 1950లో ఆమె సెటిల్ అయ్యే సరికి ఆమె పేరు జిక్కీగా స్థిరపడింది. ఆ తర్వాత ఏ ఏడాది భవిష్యత్తులో పెళ్లాడబోయే ఏ ఎం రాజాతో కల్సి డ్యూయెట్ పాడారు. అప్పటినుంచి మూడేళ్లపాటు ఇద్దరూ ఇటు స్టూడియోలలో, అటు వెలుపల సాగిన ప్రేమాయణం వారిని జంటగా చేసింది. ఏ ఎం రాజా – జిక్కీ, ఘంటసాల – జిక్కీ ఇలా ఎన్నో హిట్ డ్యూయెట్ సాంగ్స్ వచ్చాయి. 1950ల్లో చిత్ర సీమను ఓ ఊపు ఊపేసిన జిక్కీ తిరుగులేని గాయని అయింది. దక్షిణాదిన అన్ని భాషల్లో ఆమె గీతాలు పాడుతూ అలరించారు.
ఇక ఆరోజుల్లో సింహళ భాష సినిమాలు కూడా మద్రాసులో నిర్మించేవారు. అందులోనూ జిక్కీ పాటలే కనిపించేవి. హిందీలో తొలిసారి పాటలు పాడిన సింగర్స్ ఏ ఎం రాజా – జిక్కీ జంట. అలా టాప్ సింగర్ గా సాగుతున్న వేళ, 1960 వచ్చేసరికి ఎదురుదెబ్బలు తగిలాయి. కష్టాలు మొదలయ్యాయి. ఓ పక్క గాయని సుశీల ఎంటర్ అవ్వడం, మరోపక్క ఏ ఎం రాజా తీరుతో జిక్కీ ఇబ్బందులు ఎదురయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్స్ మార్పులను ఏ ఎం రాజా అంగీకరించకపోవడం, మూడీగా, మొండిగా ఉండడం వలన అతనితో పాటలు పాడించడం కష్టం అనే పరిస్థితికి ఇటు తెలుగు, అటు తమిళ సినిమా రంగంలో కూడా వచ్చేసాయి.
దీనికి తోడు లేత గొంతుగల సుశీల వైపు అందరూ మొగ్గేవారు. ఇక జిక్కీకి వచ్చే ఛాన్స్‌లను కూడా రాజా అణగదొక్కేసేవారు. ఇక భర్త బాధ భరించలేక సినీ రంగానికి కొంతకాలం జిక్కీ దూరంగా ఉండిపోయారు. ఆతర్వాత పాడాలని అనుకున్నా ఛాన్స్‌లు తగ్గిపోయాయి. అలా మూడ్‌కి జిక్కీ కెరీర్ మంటగలిసిపోయింది. ఏ ఎం రాజాకు గల టూరిస్ట్ కార్ల ఆదాయంతో పాటు సంగీత విభావరీలు కూడా మొదలు పెట్టారు. అయితే కార్ల బిజినెస్ దెబ్బతినడంతో కచేరీలు ఆధారం అయ్యాయి.
వరుసగా పుట్టిన ఆరుగురు పిల్లలతో ఫామిలీని నెట్టుకురావడం పెద్ద కష్టంగా మారడంతో కచేరీల కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేది. అలా కచేరీల కోసం రైలు ప్రయాణం చేస్తుంటే, దేనికోసమో ఓ స్టేషన్ ఫ్లాట్ ఫార్మ్ మీద దిగిన రాజా, తీరా రైలు కదిలిపోతుండడంతో గబగబా ఎక్కే ప్రయత్నంలో రైలు పెట్టెకు, ఫ్లాట్ ఫార్మ్‌కు మధ్యలో పడి ముక్కముక్కలయ్యారు. కళ్లెదుటే భర్త ఇలా కన్నుమూయడం జిక్కీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. భర్త మరణం నుంచి కోలుకుని, పిల్లలకోసం బతకాలనే నిర్ణయానికి రావడానికి చాలా ఏళ్ళు పట్టింది. అదే సమయంలో జిక్కీకి మరో గాయని జమునా రాణి నైతిక మద్దతు ఇచ్చింది. సంపాదన పోయింది, పిల్లల చదువులు సాగలేదు.
ఆడపిల్లలకు మ్యారేజ్ చేసే స్థోమత కూడా లేదు. ఇక చేసేది లేక, తన పిల్లలతో కల్సి అలనాటి తన మధుర గీతాలను సంగీత విభావరిలలో ఆలపిస్తూ, శ్రోతలను మైమరపించేవారు. క్రమేపి కచేరీలు ఆదరణ కోల్పోవడం, మరోపక్క రొమ్ము కాన్సర్ పేరిట జిక్కీకి మరో పెద్ద షాక్ తగిలింది. ఆర్ధిక స్థోమత లేకపోవడంతో ఆపరేషన్ కి వీలులేని పరిస్థితి. ఆ సమయంలో జమునా రాణి ముందుకొచ్చి, జిక్కీ సహాయార్ధం కచేరీలలో పాటలు పాడి సహకరించింది.. అంతేకాదు, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు లేఖలు రాయడంతో ప్రభుత్వాలు సహకరించాయి.
అయితే ఆమెకు శస్త్రచికిత్స చేసినా సరే, నయం కాలేదు సరికదా అప్పటికే లివర్‌కి అక్కడ నుంచి శరీరం అంతటికి కాన్సర్ వ్యాపించి ఆమెను బలితీసుకుంది. 2004 ఆగస్టు 16న ఈ లోకం నుంచి నిష్క్రమించిన జిక్కీ లేకున్నా, ఆమె పాటలు మాత్రం ఇప్పటికీ,ఎప్పటికీ శ్రోతలను మైమరపిస్తూనే ఉంటాయి.