telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పదో తరగతి పరీక్షలు అప్ప‌డే నిర్వ‌హిస్తాం..- మంత్రి క్లారిటీ

ఏపీలో పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ క్లారిటీ ఇచ్చారు. దేశంలో మ‌రోసారి క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేసే ఆలోచ‌న లేద‌ని , మార్చిలో తప్పనిసరిగా నిర్వహిస్తామని వెల్ల‌డించారు.

సాధ్య‌మైనంత త్వ‌రగా.. సీబీఎస్‌ఈ సిలబస్ ప్రారంభిస్తామన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సీబీఎస్‌ఈలో పదో తరగతి మొదటి బ్యాచ్‌ పరీక్ష నిర్వహించాల‌నేది తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

గుంటూరు జిల్లా వినుకొండలో శుక్రవారం కేజీబీవీ, గురుకుల బాలికల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం ఆయన వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆనంత‌రం మీడియాతో మాట్లాడారు. ..పదో తరగతి పరీక్షలను ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. సంక్రాంతి నాటికి సిలబస్ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అమ్మఒడి మూడో విడత ఇస్తామని తెలిపారు. ఏ విద్యార్థి డబ్బులు లేక విద్యకు దూరం కాకూడదని.. అమ్మ ఒడి ఇచ్చి విద్యార్థులకు యూనిఫాం, బుక్స్‌తో పాటు మధ్యాహ్న పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఇంగ్లీష్ మీడియం చెప్తూ తెలుగు కూడా భోదిస్తున్నామని పేర్కొన్నారు.

చట్ట సవరణ ద్వారా ఎస్‌ఆర్‌ఎం, విట్‌, సెంచురీ వంటి కార్పొరేట్‌ కళాశాలల్లో మూడు వేలమంది విద్యార్థులు ఉచిత సీట్లు పొందారని మంత్రి తెలిపారు. నిబంధనలు పాటించని 45 ఇంజినీరింగ్‌, బీఈడీ, డీఈడీ, 375 కాలేజీలు మూతపడ్డాయని మంత్రి చెప్పారు. ప్ర‌భుత్వానికి అభివృద్ధి, సంక్షేమం అనేవి రెండు కళ్లన్నారు.

కాగా ఇప్పటికే 15 నుండి18 ఏళ్ల లోపు విద్యార్థులకు ప్రతి స్కూల్లో 95శాతం వ్యాషినేషన్ పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు.

 

Related posts