ఏపీలో పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్నారు. భానుడు ఉదయం నుంచే ప్రతాపం చూపిస్తుండడంతో పొద్దెక్కకముందే ఓటేయాలన్న ఉద్దేశంతో ఓటర్లు వడివడిగా కేంద్రాలకు చేరుకుంటుండడంతో పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి.
ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణితో కలిసి చంద్రబాబు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం ఒక్కొక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. భవిష్యత్ మారాలంటే తప్పనిసరిగా ఓటేయాల్సిందేనన్నారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. అందరూ ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఇవి చాలా కీలమైన ఎన్నికలని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు దేశానికి దశ, దిశను నిర్దేశించాలని అన్నారు.
టీడీపీ ఎంపీ అభ్యర్థి అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతి రాజులు కొద్దిసేపటి క్రితం తమ ఓటు హక్కును విజయనగరంలో వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు. కాగా నేడు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండడంతో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. చాలాప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటిని ఏర్పాటు చేశారు. ఓటర్లు వడదెబ్బకు గురికాకుండా టెంట్లు వేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి మరికాసేపట్లో హెలికాప్టర్‌లో చింతమడక చేరుకోనున్న కేసీఆర్ దంపతులు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక సొంతూరికి రానుండడం ఇదే తొలిసారి. కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బంజారాహిల్స్ నందినగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాలులో ఓటుహక్కు వినియోగించుకుంటారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు ఉదయం 9 గంటలకు సోమాజీగూడ ఎంఎస్ మక్తాలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తారు.
ఇప్పటి వరకు 2 శాతం ఓటింగ్ నమోదైనట్టు సమాచారం.
“జనసేన” పార్టీ డబ్బు పంచడంపై నాగబాబు స్పందన