ఏపీ ప్రభుత్వం మహిళల భద్రత కోసం తాజాగా బీ సేఫ్ యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ను హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆవిష్కరించారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె సహచర మంత్రులు తానేటి వనతి, శ్రీరంగనాథ రాజు, మోపిదేవి వెంకటరమణ, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ లతో కలిసి దీన్ని ఆవిష్కరించారు. ఆపదలో ఉన్న సమయంలో అమ్మాయిలు ధైర్య సాహసాలను ప్రదర్శించాల్సిన అవసరం ఉందని మంత్రి సుచరిత అభిప్రాయపడ్డారు. అత్యవసర సమయాల్లో డయల్ 100, మహిళా హెల్ప్ లైన్ 181, 1091 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. గ్రామ సచివాలయాలను కూడా సంప్రదించవచ్చని, అందుబాటులో ఉన్న రక్షణ యాప్ లను ఉపయోగించుకోవాలని చెప్పారు. రాత్రిళ్లు బయటకు వెళ్లేటప్పుడు తోడుగా ఎవరినైనా తీసుకెళ్లాలని సూచించారు.
దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని ప్రవేశపెట్టాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సూచించినప్పటికీ.. అమలు కావట్లేదని అన్నారు. మన రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఫిర్యాదులను స్వీకరించని పోలీసు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సుచరిత హెచ్చరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని వెల్లడించారు. మహిళలు తమ సమస్యలను చెప్పుకునేందుకు మహిళ మిత్ర, సైబర్ మిత్రను తీసుకొచ్చామని, వాటి ద్వారా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలిపారు.