telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అష్ట‌దిగ్బంధ‌నంలో అమలాపురం..

*చ‌ల్ల‌బ‌డిన కోన‌సీమ‌..
*కోన‌సీమ అదుపులోకి వ‌చ్చిన ప‌రిస్థితి..
*కోన‌సీమ ఘ‌ట‌న‌పై 7 కేసులు న‌మోదు..
*జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులు మోహ‌రింపు..

ఆందోళ‌న‌కారుల‌తో అట్టుడికిపోయిన అమలాపురం ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది. ముందస్తుగా పోలీసులు భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. అమలాపురం పట్టణం అంత‌టా పోలీసులు అష్ట‌దిగ్బంధ‌నం చేశారు. 

కోనసీమ జిల్లా పేరు మార్చొద్దంటూ నిరసనకారులు మంగళవారం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసుల అంచనాలను తలకిందులు చేస్తూ.. నిరసనకారులు వేలాదిగా రోడ్లపైకి రావడంతో పరిస్థితి అదుపు తప్పింది.

ఈ నేపథ్యంలో.. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఏలూరు రేండ్‌ డీఐజీ పాలరాజు రాత్రి నుంచి అమలాపురంలోనే ఉండి సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు.

అంతేకాకుండా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. అమలాపురంలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. కోనసీమ అంతటా కర్ఫ్యూ కొనసాగుతోంది. 

కాగా.. ఆందోళనకారుల్లో 46 మందిని అదుపులోకి తీసుకున్న‌ట్లు ఏపీ డీజీపీ రాజేంద్ర‌నాద్ తెలిపారు. మ‌రో 72 మంది అరెస్ట్‌కు  బృందాలు రంగంలోకి దిగి న‌ట్లు  డీజీపీ  తెలిపారు.ఈ ఘ‌ట‌న సంబంధించి 7 కేసులు న‌మోదైన‌ట్లు పోలీసులు తెలిపారు.

కోనసీమలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉంటాయని, ర్యాలీలు.. నిరసనలు.. బహిరంగ సభలకు అనుమతి లేదన్న పోలీసులు స్పష్టం చేశారు.

Related posts