‘డ్రగ్స్’ వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధం లేకపోయినా ప్రతిపక్ష పార్టీ దుష్ఫ్రచారం చేస్తోందని సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్లు అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై సీఎం సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
కాలేజీలు, యూనివర్సిటీలు మాదకద్రవ్య రహిత ప్రదేశాలుగా ఉండాలి. అసలు మాదక ద్రవ్యాల ఉదంతాలు ఉన్నాయో లేవో అన్నది కచ్చితంగా నిర్ధారించుకునేందుకు అన్ని కాలేజీలు, యూనివర్సిటీల్లో నిశితంగా పర్యవేక్షించండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో కాలేజీలు, యూనివర్సిటీలే డ్రగ్స్ విక్రయాల పాయింట్లుగా ఉంటాయి. అక్కడే మనం సమర్థంగా కట్టడి చేయగలిగితే డ్రగ్స్ వ్యవహారాలను అరికట్టినట్టే. అన్ని కాలేజీలను మ్యాపింగ్ చేయండి.
ఎక్కడైనా డ్రగ్స్ విక్రేతలు ఉన్నట్లు తెలిస్తే అదుపులోకి తీసుకుని విచారించడం ద్వారా ఎవరు పంపిణీ చేస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనేది గుర్తించి మూలాల నుంచే డ్రగ్స్ వ్యవహారాలను పూర్తిగా తుడిచిపెట్టవచ్చు. డ్రగ్స్ ఆనవాళ్లు అన్నవి ఉండకూడదు. దీన్ని ఓ సవాల్‌గా తీసుకుని కార్యాచరణ రూపొందించండి. ఎస్పీలు, కమిషనర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి ప్రతి నాలుగు వారాలకు ఒకసారి దీనిపై నివేదిక సమర్పించాలి. ఈ అంశంలో పనితీరు ఎలా ఉందో నిశితంగా సమీక్షిస్తా అన్నారు.