2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఈరోజు ఏపీ అసెంబ్లీలో మధ్యాహ్నం 12.22 నిమిషాలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రూ.2 లక్షల 27 వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నప్పటికీ… సున్నా వడ్డీ రుణాలపై చర్చ నేపథ్యంలో సమయాన్ని మార్చారు. మధ్యాహ్నం 12.22 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసనమండలిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు.
వ్యవసాయానికి రూ.28 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఎన్నికల హామీలు, మేనిఫెస్టో అంశాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించనున్నట్లు తెలిసింది. విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పన, సాగునీటి రంగానికి ప్రాధాన్యం కల్పించనున్నారు. నవరత్నాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది.