telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వాయుగుండం కారణంగా వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, సిబ్బందితో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు.

వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రానున్న 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ వైపుగా ఇది కదలే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

కోస్తాంధ్రలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవచ్చని చెబుతున్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాల్లో అలలు 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తులో ఎగసిపడే అవకాశం ఉందని చెబుతున్నారు. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.

వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ప్రమాద హాట్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇరిగేషన్, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయంతో గండ్లు గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి మంత్రి స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ 112, 1070, 1800 425 0101 నంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపారు.

Related posts