కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఆధారిత వాహనాలకు రిజిస్ట్రేషన్ చార్జీలను రద్దు చేయాలని ప్రతిపాదించింది. పర్యావరణ హిత వాహనాల వినియోగానికి ఊతమివ్వడంలో భాగంగా మోదీ సర్కారు ఈ నిర్ణయానికొచ్చింది. ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ముసాయిదా ప్రకటనను జారీ చేసింది. వాహన కాలుష్యం.. మానవ జాతి మనుగడనే ప్రమాదంలోకి నెడుతున్న నేపథ్యంలో కాలుష్య రహిత వాహనాలను ప్రోత్సహించాలని నరేంద్ర మోదీ సర్కారు నిశ్చయించుకున్నది. 2030 నాటికి వాడకంలో విద్యుత్ వాహనాలే ఉండాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగానే విద్యుత్ ఆధారిత వాహనాల వైపు వాహనదారులు చూసేలా రిజిస్ట్రేషన్ చార్జీలను ఎత్తివేయాలని ప్రతిపాదించింది.
తదనుగుణంగా సెంట్రల్ మోటర్ వెహికిల్స్ రూల్స్ (సీఎంవీఆర్) 1989 చట్టాన్ని సవరించినట్లు తాజా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో సదరు మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. బ్యాటరీతో నడిచే వాహనాలకు రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపునివ్వాలని నిర్ణయించినట్లు చెప్పింది. ఈ మేరకు నిబంధన 81లో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, పాత వాహనాల రెన్యువల్ కోసం ఎలాంటి చెల్లింపులు జరుపనక్కర్లేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ టూవీలర్లతోపాటు త్రీవీలర్, ఫోర్‌వీలర్ మిగతా అన్ని విద్యుత్ ఆధారిత వాహనాలకు ఇది వర్తిస్తుందని ప్రకటించింది. కాగా, తమ ఈ నిర్ణయంపై నెల రోజుల లోపల అభిప్రాయాలను తెలుపవచ్చని ఈ సందర్భంగా రవాణా మంత్రిత్వ శాఖ చెప్పింది.