బీజేపీ పాలనలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కూడా ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని చెప్పారు. లక్షల కోట్లు అప్పులు చేసి లెక్కలు కూడా తప్పులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయొద్దని గవర్నర్‌ను కలిసి వివరించామని వెల్లడించారు.
దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు,రైతులు,ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని కాంగ్రెస్ ప్రశ్నించిందన్నారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్‌లు చేయించడం దారుణమన్నారు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన ఛలో ట్యాంక్‌బండ్ పిలుపుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని భట్టి పేర్కొన్నారు.