telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ కు ఆంధ్ర విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్

అసాధారణ సాహితీమూర్తి పద్మశ్రీ డాక్టర్ కొలకలూరి ఇనాక్ గారికి ఆంధ్ర విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. 1959లో అదే యూనివర్సిటీ నుంచి బి.ఎ. ఆనర్స్ పూర్తి చేశారు. అదే విశ్వ విద్యాలయం లో అధ్యాపకులుగా ప్రస్థానం ప్రారంభించిన ఇనాక్ గారు తన 85వ ఏట అదే విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు!

దళిత భూమి లోంచి చొచ్చుకు వచ్చి ఎన్నో కష్టాలు వివక్షలు ఎదుర్కొని ఎదురీది సాహితీ విద్యా వట వృక్షం గా మారిన ఇనాక్ గొప్ప ఆదర్శ ప్రదాత! ఆరున్నర దశాబ్దాలుగా అలుపెరుగని సాహితీ సేద్యం చేస్తున్న గొప్ప రచయిత! సాహిత్య రంగం లో అన్ని ప్రక్రియల్లో రచనలు చేసిన సాహితీవేత్త! పిహెచ్ డి చేసిన శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయానికే వైస్ ఛాన్స్-లర్ అయిన మహా మేధావి, అంతకు మించిన గొప్ప మనవతామూర్తి ఇనాక్ గారు! కర్నూలు లోని రాయలసీమ యూనివర్సిటీ నుంచి కూడా ఆయన గౌరవ డాక్టరేట్ అందుకున్నారు!

అత్యున్నత స్థాయికి చేరినా మూలాలను మరచిపోని స్ఫూర్తి శిఖరం ఆయన! ఎలాంటి భేషజాలు వుండవు! ఎంతో ఒదిగి ఉంటారు! ఎంతో ప్రేమ గా ఆత్మీయంగా పలకరిస్తారు! ఎప్పుడయినా ఏ కార్యక్రమానికి పిలిచినా “వస్తున్న” అని వెంటనే చెప్పడమే కాకుండా, కార్యక్రమం రోజున ఖచ్చితంగా సమయానికి వచ్చేస్తారు! సందర్భచితంగా చక్కగా ప్రసంగిస్తారు! చక్కటి పంచెకట్టు లో చెదరని చిరునవ్వు తో ఉట్టిపడే ప్రేమ కళ్ళ తో నిలువెత్తు తెలుగు సంతకం లా కనిపిస్తారు!

చదివిన యూనివర్సిటీ లో చదువు చెప్పిన యూనివర్సిటీ లో ప్రతిష్టాత్మక గౌరవం పొందడం అంటే హిమాలయాల అంచులను తాకిన సంబరమే! ఒకరిద్దరికి మాత్రమే లభించే అరుదైన మహా గౌరవం ఇది! ఆంధ్ర విశ్వ విద్యాలయం 90వ స్నాతకోత్సవం సందర్బంగా ఈనెల 9న విశాఖ యూనివర్సిటీ ఆడిటోరియం లో గౌరవ డాక్టరేట్ ప్రదానం జరగనున్నది!

Related posts