టిషా రోవ్ అనే వైద్యురాలు అమెరికాలోని మియామీలో నివసిస్తున్నారు. కాగా తన బంధువులను చూసొచ్చేందుకు కొడుకుతో సహా కొద్దిరోజుల క్రితం జమైకా వెళ్లారు. కొన్ని రోజుల తరువాత మియామీకి తిరుగు ప్రయాణమయ్యేందుకు జూన్ 30న కింగ్‌స్టన్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలో జమైకాలో వేడి ఎక్కవగా ఉండటంతో… అందుకు అనువుగా ఉండే దుస్తులను ధరించారు. ఈ క్రమంలో కొడుకుతోపాటు ఆమె విమానంలోకి అడుగుపెట్టబోతుండగా… సిబ్బంది ఆమెను ఆపి, “మీ దగ్గర ఏదైనా లెదర్ జాకెట్ ఉందా” అని ఆమెను ప్రశ్నించారు. “లేదు” అని టిషా జవాబిచ్చారు. దీంతో సిబ్బంది..”మీరు ఈ దుస్తులు ధరించి విమానం ఎక్కకూడదు” అని స్పష్టం చేశారు. తను వేసుకున్న దుస్తులు జమైకా వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఉన్నాయని ఎంత చెప్పినా వారు వినలేదు. చేసేదేమి లేక సిబ్బంది ఇచ్చిన దుప్పటి కప్పుకుని ఫ్లైట్ ఎక్కారు. అయితే విమానం ల్యాండ్ అయిన తరువాత ఆమెకు షాకిచ్చే దృశ్యం ఎదురైంది. తన కన్నా పొట్టి షార్ట్స్ వేసుకున్న మరో మహిళ ఫ్లైట్ దిగుతూ కనిపించింది. అనంతరం జరిగిన ఉదంతాన్ని తెలియజేస్తూ ఆమె ట్విట్ చేశారు. ఆ దుస్తుల్లో ఉన్న తన ఫోటో ఒకటి కూడా జత చేశారు.
ఈ ఘటనకు సంబంధించి టిషా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ ఇచ్చారు.”ఆ మహిళ నాకంటే కాస్త సన్నగా ఉంది. అయితే..ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నేను మహిళనే కాకుండా ఒక నల్లజాతీయురాలని కూడా..” అంటూ ఆమె వ్యాఖ్యానించింది. కాగా..ఈ ఘటనపై స్పందించిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ టిషాకు క్షమాపణలు చెప్పింది. “అన్ని వర్గాల ప్రజలకూ సేవలందించటాన్ని మేము గర్వంగా భావిస్తాం. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అన్ని చర్యలూ తీసుకుంటాం” అని సంస్థ ప్రతినిథి తెలిపారు. కాగా టికెట్ డబ్బులను తనకు తిరిగి చెల్లిస్తామని విమానయాన సంస్థ చెప్పినప్పటికీ…ఇంతవరకూ తన ఆ సొమ్ము అందలేదని టిషా తెలిపారు. ఈ ఘటన వైరల్ అవడంతో ప్రస్తుతం నెటిజన్లు సదరు విమానయాన సంస్థ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.