telugu navyamedia
తెలంగాణ వార్తలు

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం

యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తేనే రైతులకు మేలు చేకూరుతుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో యాదవ్ నగర్ లో రైతులతో సమావేశం నిర్వహించారు. అక్కడి రైతులతో యాసంగిలో పంటసాగు ప్రణాళికపై చర్చించారు.

యాసంగిలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వడ్లు కొనుగోలు చేసేవిధానంలేకపోవడంతో యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని పేర్కొన్నారు. మిల్లర్లు, సీడ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు మాత్రమే వరి పంట వేసుకోవాలని సూచించారు. ఒప్పందం చేసుకోని రైతులు వరి పంట వేసుకుంటే ధాన్యాన్ని సొంతంగానే అమ్ముకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వరికి బదులు మినుములు కందులు, జొన్నలు, నువ్వులు తదితర లాభసాటి పంటలు వేసుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు.

ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి సరిపడా విత్తనాలను రైతులకు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. పంట మార్పిడికి తగిన సూచనలు సలహాలు కూడా రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తామని కలెక్టర్ అన్నారు. భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహిస్తుందని, ప్రత్యామ్నాయ సాగు కు రైతులు సహకరించాలని కలెక్టర్ కోరారు.

Related posts