telugu navyamedia
సామాజిక

స్వ‌తంత్ర్య‌ సమర చరిత్ర పై అగ్ని శిఖతో చేసిన రక్త సంతకం – అల్లూరిసీతారామరాజు.

మన దేశంలోని గిరిపుత్రులు తమ శౌర్యపరాక్రమాలతో ఎన్నోసార్లు విదేశీ శక్తిని తన మోకాలుపైకి తెచ్చారు. జార్ఖండ్ లో బిర్సా ముండా బ్రిటిష్ కు సవాలు విసిరారు, ముర్ము సోదరులు సంతాల్ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఒడిశాలో చక్ర బిసోయి బ్రిటిష్ వారిపై యుద్ధం చేయగా, గాంధేయ పద్ధతుల ద్వారా లక్ష్మణ్ నాయక్ చైతన్యం రగిలించాడు.

ఆంధ్రప్రదేశ్ లో మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో రంప ఉద్యమం తో బ్రిటిష్ పై యుద్ధం చేసాడు, మిజోరాం లోని కొండల్లో బ్రిటిష్ వారి పై తిరుగుబాటు చేసిన పసల్తా ఖుంగ్చెరా. అస్సాం ఈశాన్య ప్రాంతాలకు చెందిన స్వాతంత్ర్య సమరయోధులైన గోమ్ధర్ కోన్వార్, లచిత్ బొర్ఫుకాన్ మరియు సెరత్ సింగ్ వంటి వారు దేశ స్వాతంత్ర్యానికి త్యాగం చేశారు.

గుజరాత్ లోని జంబుగోడాలో నాయక్ గిరిజనుల త్యాగాన్ని, మంగగఢ్ లో గోవింద్ గురు నేతృత్వంలో వందలాది మంది గిరిజనులను ఊచకోత కోర్చి చేసిన త్యాగాన్ని దేశం ఎలా మర్చిపోగలదు?

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 – 1924 మే 7) రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య శక్తి పై యుద్ధం ప్రకటించిన, చేసిన స్వతంత్ర సమర సేనాని. బ్రిటిష్ పై యుద్ధం ప్రకటించిన అతికొద్ది మంది స్వతంత్ర సేనా నులలోఅరుదైన మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, బిర్సా ముండా,రాంజీగోండు లాంటి వేళ్లపై లెక్కించగల అతికొద్ది మంది సాయుధ సేనానులలో అల్లూరి సీతారామరాజు ప్రముఖులు.

రామరాజు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు, అసంఘటితులు, వెనుకబడిన గిరిజన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. రవి అస్తమించని బ్రిటిష్ పై యుద్దాన్ని ముందుగా తానే ప్రకటించి, యుద్దాన్ని చేసిన, బరీగీసి తొడగొట్టి ఎదురునిలిచిన యోధుడు అల్లూరి సీతారామరాజు.

అగ్నికణం అల్లూరి - Vishwa Samvad Kendra Andhra Pradesh

1882 మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్‌కు కు వ్యతిరేకంగా బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడాడు. ఈ చట్టం ఆదివాసీల (గిరిజన సంఘాలు) అటవీ ఆవాసాలలో స్వేచ్ఛగా సంచారాన్ని నిరోధించింది, ఆదివాసీ సాంప్రదాయ పోడు వ్యవసాయాన్ని నిషేదించింది. దీనితో బ్రిటీష్ వారి పట్ల పెరుగుతున్న అసంతృప్తి 1922 నాటి రంప తిరుగుబాటుకు దారితీసింది, రంప తిరుగుబాటుకు అల్లూరి నాయకుడిగా ప్రధాన పాత్ర పోషించాడు. ఆదివాసీలు, రైతులు సానుభూతిపరులను సమీకరించడం ద్వారా, ఆయన తూర్పు గోదావరి, విశాఖపట్నం (ప్రస్తుతం అల్లూరి సీతారామ రాజు జిల్లాలో భాగం) జిల్లాల్లోని మద్రాస్ ప్రెసిడెన్సీలోని సరిహద్దు ప్రాంతాలలో బ్రిటిష్ వలస అధికారులకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాలకు నాయకత్వం వహించాడు. అల్లూరి వీరోచిత పరాక్రమాలకు స్థానిక గ్రామస్తులు అతనికి “మన్యం వీరుడు” అని పిలిచేవారు.

సహాయ నిరాకరణ ఉద్యమం నేపథ్యంలో బ్రిటీష్ వలస పాలన పట్ల నానాటికి పెరుగుతున్న అసంతృప్తి అగ్ని కి తన సంఘటిత చైతన్యం అనే ఆజ్యం పోసాడు. తన గెరిల్లా యుద్ధ వ్యూహాలు, రహస్య ప్రసార ప్రచారాల ద్వారా కొత్త కమ్యూనికేషన్ మార్గాల ద్వారా తూర్పు కనుమల మన్యం నుండి తెల్ల వారిని బహిష్కరించాలనే లక్ష్యంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన దళాలను నడిపించాడు.

అల్లూరి అతి కొద్ది మంది గానే వున్న తన దళాలను సాయుధం చేయడం కోసం తుపాకీలను సంపాదించడానికి స్థానిక పోలీసు స్టేషన్లపై దాడులచేసే వ్యూహలను వేసి అనేక ఎత్తుగడలతో ఆయుధాలను సమాకుర్చుకున్నాడు. ప్రతి దాడికి తానే నాయకత్వం వహించాడు, దాడి చేసిన తర్వాత ఒక లేఖను వ్రాసి వదిలివేస్తాడు, తాను తీసుకుపోయిన ఆయుధాల తన దాడుల వివరాల గురించి పోలీసులకు తెలియజేస్తూ, తన తదుపరి చేయబోయే దాడుల గురించి ఏ ఏ పోలీస్ స్టేషన్ ల లో ఆయుధాలను ఎత్తుకొని వెళ్ళబోయేది వివరాలు తెలుపుతూ ముందస్తు సమాచారం ఇచ్చేవారు. వీలైతే తనను ఆపడానికి ధైర్యం చేయమని సవాలు విసిరేవారు.

అల్లూరి సీతారామరాజు - వికీపీడియా

ఈ విధంగా అన్నవరం, అడ్డతీగల, చింతపల్లె, దమ్మనపల్లి, కృష్ణాదేవి పేట, రంపచోడవరం, రాజవొమ్మంగి, నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్లు అన్నింటిని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించి తుపాకులు దోసుకుపోయారు.

ఈ దాడులకు ప్రతిస్పందనగా, తిరుగుబాటును అణిచివేసేందుకు, బ్రిటీష్ వలస అధికారులు అతని కోసం దాదాపు రెండు సంవత్సరాలపాటు సుదీర్ఘకాలం పాటు వేటను చేపట్టారు, ₹40 లక్షల రూపాయలకు ఖర్చు పెట్టారు .

1882 మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ తో అటవీ ప్రాంతాలలో ఆర్థిక దోపిడీ చేసే ప్రయత్నంలో, అడవులలో గిరిజన ప్రజల స్వేచ్ఛా సంచారంపై పరిమితులు విదిస్తూ వారి సాంప్రదాయ పోడు వ్యవసాయాన్ని నిషేధించింది. పోడుసాగు గిరిజన జీవనాధారం. ఇది వలస సాగు వ్యవస్థ అడివి నరికి కొంత కాలం సాగు చేసి ఆపొలం వదిలి వేరే ప్రాంతానికి పోయే విధానం. బ్రిటిష్ ప్రభుత్ విధానం వల్ల గిరిజనులు పస్తులతో ఆకలి చావులతో అవమానకరమైన, కఠినమైన, విదేశీ దోపిడీ కూలీ తో సతమతమాయ్యారు. ప్రభుత్వం దాని కాంట్రాక్టర్లు రోడ్డు నిర్మాణం వంటి వాటికి గొడ్డు చాకిరీ చేయించేవారు.

బ్రిటిష్ వలసవాద న్యాయస్థానాలను బహిష్కరించడం పంచాయితీ కోర్టులలో నే సత్వర న్యాయం తో అల్లూరి సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రజల మద్దతుపెరిగింది. కొండ ప్రజలలో తమ సహజ జీవన శైలి ని పద్ధతులను ప్రచారం చేయడం, వారి రాజకీయ స్పృహను పెంచడం వారిలో ప్రగతి శీల మార్పు కోసం అతను నిమగ్నమై పనిచేయడం తో ఉద్యమం మైదాన ప్రాంతానికి చేరుకుంది.

ఈ ఉద్యమకార్యకలాపాలవల్ల అతనిపై ఆ సంవత్సరం ఫిబ్రవరి నుండే పోలీసుల నిఘాపెట్టారు. అయినప్పటికీ అతను సాయుధ తిరుగుబాటును ప్రేరేపించడానికి పై కార్యకలాపాలు కేవలం వారిని మభ్యపెట్టడానికే అనే వాస్తవాన్ని బ్రిటిష్ రాజకీయ నాయకత్వం గుర్తించలేదు.

తన మద్దతుదారులతో, ఆయన బలమైన శక్తివంతమైన యోధుల దళాలను నిర్మించారు. విల్లు అంబులు ఈటెల వంటి సాంప్రదాయ ఆయుధాలను వాడటం తమలో తాము సందేశాలను బట్వాడ చేసుకోవడానికి ఈలలు డప్పులు కొట్టడం వంటి వ్యూహాలను ఉపయోగించి, విప్లవకారులు బ్రిటిష్ వారి పోరాటంలో అద్భుతమైన విజయాలు సాధించారు.

సాంప్రదాయ ఆయుధాలు బ్రిటీష్ వారిఆధునిక తుపాకీల సైనిక సామర్ధ్యనికి వ్యతిరేకంగా పెద్దగా ఉపయోగపడవని గ్రహించి, శత్రువు నుండి వారి ఆయుధాలను దూరం చేయటమే ఉత్తమ మార్గం అని భావించి పోలీసు స్టేషన్లపై దాడులు చేయడం ప్రారంభించారు.

ఆగష్టు 1922 నుండి, అతను చింతపల్లె, కృష్ణాదేవి పేట రాజవొమ్మంగిలో వరుస రోజుల పోలీసు స్టేషన్లలో దోపిడిలో 500 మంది దళానికి నాయకత్వం వహించారు, అక్కడ వున్న తుపాకులు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయన తదనంతరం ఆ ప్రాంతాన్ని పర్యటించాడు, ఎక్కువ మంది యువత ను దళాలలో చేర్చారు.అల్లూరి ని పట్టుకోవడానికి పంపిన బలగంలో ని ఒక పోలీసు అధికారిని చంపారు.

ఈ దాడుల యొక్క విశిష్టత ఏమంటే, అల్లూరి చేసిన ప్రతి దాడి తర్వాత, అతను స్టేషన్ల డైరీలో స్టేషన్ నుండి దోచుకున్న వివరాలను దాడి చేసిన తేదీ సమయాన్ని వ్రాసి ఒక లేఖపై సంతకం చేస్తారు, తను తర్వాత పోలీస్ స్టేషన్ లపై చేయబోయే దాడుల గురించి వివరాలు ముందస్తు గా రాసి పోలీసులు చేయగలిగితే అతన్ని ఆపడానికి ధైర్యం చేయవచ్చని సమాచారమిస్తారు.

సెప్టెంబరు 23న, అతను దమ్మనపల్లి ఘాట్ గుండా వెళుతుండగా, పోలీసు పార్టీని ఎత్తులో తిష్ట వేసిన అల్లూరి సైన్యం మట్టుబెట్టి ఉన్నత స్థానం నుండి మెరుపుదాడి చేయడంతో ఇద్దరు అధికారులు చనిపోయారు. అగ్రహా జ్వాలాల్లో రగులుతున్న ప్రజలలో రాజు ఒక సేనాని గా ఖ్యాతి తెచ్చింది . ఈ నెలలో పోలీసులకు వ్యతిరేకంగా మరో రెండు విజయవంతమైన దాడులు జరిగాయి, ఆ తర్వాత అతని గెరిల్లా యుద్ధ శైలిని కి సమాధానం గేరిల్లా విధమైన ప్రతిస్పందనే సరైనదని బ్రిటీష్ వారు గ్రహించారు.

గెరిలా యుద్ధం కోసం శిక్షణ పొందిన మలబార్ స్పెషల్ పోలీస్ ను రప్పించారు . రాజు ను పట్టి ఇచ్చిన వారికి ఇనాం ప్రోత్సాహకాలు మరియు ప్రతీకారం రెండింటి ద్వారా రామరాజు గురించి సమాచారం తెలియజేయడానికి లేదా రామరాజు కి వారి మద్దతును నిరాకరించడానికి స్థానిక ప్రజలను బుజ్జగించేప్రయత్నం చేశారు.

తర్వాత అన్నవరం, అడ్డతీగల, నర్సీపట్నం మరియు రంపచోడవరం పోలీస్ స్టేషన్లపై దాడులు జరిగాయి.

ఏజెన్సీ కమీషనర్, J. R. హిగ్గిన్స్ రామరాజు తలపై రూ. 10,000 అతని అనుచరులు గంటం దొర మరియు మల్లు దొరలకు ఒక్కొక్కరికి రూ. 1,000 నగదు బహుమతిని ప్రకటించారు. ఏప్రిల్ 1924లో, ‘మన్యం’ తిరుగుబాటును అణిచివేసేందుకు, బ్రిటీష్ ప్రభుత్వం T. G. రూథర్‌ఫోర్డ్‌ను నియమించింది, రాజు మరియు అతని సన్నిహిత అనుచరుల ఆచూకీ తెలుసుకోవడానికి ప్రజలపై తీవ్ర హింస, చిత్రహింసల పద్ధతులను అవలంబించాడు.

అల్లూరి సీతారామరాజును పట్టుకోవడానికి అప్పటి జిల్లా కలెక్టర్లు, తూర్పుగోదావరి బ్రాకెన్ మరియు ఆర్.టి. విశాఖపట్నంకు చెందిన రూథర్‌ఫోర్డ్ తిరుగుబాటు ప్రాంతాలలోని గ్రామాలను తగలబెట్టడం నుండి, పంటలను నాశనం చేయడం, పశువులను చంపడం, మహిళలపై అఘాయిత్యాల వరకు దుర్మార్గమైన అన్ని మార్గాలను ఉపయోగించారు.

దాదాపు రెండు సంవత్సరాల పాటు భారీ ప్రయత్నం చేసిన తర్వాత, బ్రిటీష్ వారు చివరకు చింతపల్లె అడవుల్లో అల్లూరిని పట్టుకోగలిగారు. బ్రిటీష్ వారి పన్నిన ఉచ్చులో అల్లూరి చిక్కుకున్నారు. అక్కడ, ఆయనను బంధించారు, తరువాత అతన్ని చెట్టుకు కట్టివేసి, 7 మే 1924న కొయ్యూరు గ్రామంలో కాల్చి చంపారు.

ప్రస్తుతం ఆయన సమాధి విశాఖపట్నం సమీపంలోని కృష్ణదేవిపేట గ్రామంలో ఉంది.అతని అనుచరులు , గంటం దొర 6 జూన్ 1924న చంపబడ్డారు, అతని సోదరుడు మల్లం దొర పట్టుబడి జైలు పాలయ్యాడు, స్వాతంత్ర్యం తర్వాత అతను భారత లోక్‌సభ సభ్యుడు. అత్యంత శక్తివంత సామ్రాజ్యమైన బ్రిటిష్ కు వ్యతిరేకంగా ఎటువంటి రాజ్యాధికారాలు, మంది మార్బలం, ఆయుధాలు, సైన్యం లేకుండా సంపూర్ణ యుద్ధం ప్రకటించి, చేయడంలో యువసేనాని అల్లూరి యొక్క వీరోచిత పరాక్రమ స్థైర్యం అనన్య సామాన్యం. దేశంలో వేళ్లపై లెక్కించంగలిగిన అతి కొద్దిమంది స్వతంత్ర సమరంలో శత్రువు పై నేరుగా యుద్ధం ప్రకటించిన యోధులలో అల్లూరి సీతారామరాజు ఒకరని అందరూ గుర్తించారు.

Alluri Sitarama Raju - JournalsOfIndia

కేవలం బోస్, అల్లూరి సీతారామరాజు బిర్సముండా రాంజీగోండు లు మాత్రమే మలి స్వాత్రంత్ర పోరాటం లో శత్రువు పై యుద్ధం ప్రకటించిన, చేసిన వీరయోధులు.

భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజగురు, సుఖదేవ్ వంటి విప్లవకారులు, ఉద్యమనేతలు. హింసాత్మాక దుందుడుకు చర్యలతో దేశ స్వతంత్ర పోరాటం లో మహోజ్వల అధ్యాయం రచించిన యోధులే, సామ్రాజ్యం పై యుద్ధం ప్రకటించిన చేసిన అరుదైన యోధులు బోస్, అల్లూరి సీతారామరాజు, బిర్సముండా రాంజీగోండు లు.

దాదాపు రెండు సంవత్సరాల పాటు సాగిన గెరిల్లా యుద్ధానికి బ్రిటీష్ ప్రభుత్వం అతనిని శక్తిమంతమైన వ్యూహకర్తగా గుర్తించింది, అతనిని ఓడించడానికి వారు ఆ రోజుల్లో ₹40 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చిందనే విషయమే దానికే సాక్ష్యం.

గాంధీ :-

అల్లూరి సాయుధ తిరుగుబాటును నేను ఆమోదించనప్పటికీ, ఆయన ధైర్యానికి, త్యాగానికి నివాళులు అర్పిస్తున్నాను’ అని మహాత్మాగాంధీ అల్లూరి జీవితానికి నివాళులర్పించారు.

జవహర్‌లాల్ నెహ్రూ :-

“వేళ్లపై లెక్కించగల అతికొద్ది మంది హీరోలలో రాజు ఒకరు” జవహర్‌లాల్ నెహ్రూ అని వ్యాఖ్యానించారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ :-

అల్లూరి తన దృఢ సంకల్పంలో చురుకుడని, ప్రజల కోసం అతని అసమానమైన ధైర్యం మరియు త్యాగం అతనికి చరిత్రలో స్థానం కల్పిస్తాయని నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.

2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడేరు ప్రధాన కార్యాలయంగా పూర్వపు విశాఖపట్నం జిల్లా నుండి అల్లూరి పేరు మీద కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది.

1857 నాటి ప్రధమ స్వాతంత్ర్య పోరాటం, దేశానికి సత్యాగ్రహ శక్తి స్ఫూర్తి తో దక్షిణాఫ్రికా నుంచి మహాత్మాగాంధీ తిరిగి రావడం, సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని కాంక్షిస్తూ స్వరాజ్యం నా జన్మ హక్కని నినదించిన లోకమాన్య తిలక్ , నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో చలో ఢిల్లీ రణ న్నినాదంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ఢిల్లీ మార్చ్, 1942 క్విట్ ఇండియా ఉద్యమం నేటికీ భారతదేశం మరిచిపోలేని చారిత్రిక మైలురాళ్లు.

ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం లో సాహసోపేతమైన మంగల్ పాండే, తాంత్యా తోపే, బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన నిర్భయ రాణి లక్ష్మీబాయి, కిట్టూరు రాణి చెన్నమ్మ, రాణి గైడిన్లు, చంద్ర శేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్‌గురు, గురు రామ్ సింగ్, టైటస్ జి, పాల్ రామసామి, పండిట్ నెహ్రూ, సర్దార్ పటేల్, బాబాసాహెబ్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, మౌలానా ఆజాద్, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, టంగుటూరి ప్రకాశం పంతులు,బీర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, రాంజీగోండు అందరూ త్యాగధనులు.

నిస్వార్ధ త్యాగ ధనుల వ్యక్తిత్వాలు స్వాతంత్ర్య ఉద్యమానికి మార్గదర్శకాలు. కోల్ తిరుగుబాటు, హో ఉద్యమం, ఖాసి ఆందోళన, సంతల్ విప్లవం, కాచర్ నాగ ఆందోళన, కుకా ఉద్యమం, భిల్ ఉద్యమం, ముండా క్రాంతి, సన్యాసి ఉద్యమం, రామోసి తిరుగుబాటు, కిత్తూర్ ఉద్యమం, ట్రావెన్కోర్ ఉద్యమం, బర్డోలి సత్యాగ్రహం, చంపారన్ సత్యాగ్రహం, సంబల్పూర్ సంఘర్షణ, చువార్ తిరుగుబాటు, బుండెల్ ఉద్యమం, మన్యం లో అల్లూరి రంప పితూరీ … ఆందోళనలు, యుద్దాలు ఉద్యమాలు దేశంలోని ప్రతి ప్రాంతంలో స్వేచ్ఛా జ్వాలను రగిలించాయి

స్వాతంత్ర్య పోరాటంలో వీరుల త్యాగాలు ఉద్యమాల నుంచి ఉత్తేజం, స్ఫూర్తి తో ప్రేరణ పొంది దేశం ప్రగతి పధం లో ముందుకు సాగడం మన ముందున్న కర్తవ్యం.

నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు, అసంఘటితులు, గిరిజనులు, దిగువ స్థాయి వెనుకబడినవర్గాల సంక్షేమం, పేద ప్రజల ప్రగతి కోసం అలోచించటం,

వారి అభివృద్ధి ని కాంక్షించడం వారికి చేతనయనది చేయటం,

చాలా పరిమిత వనరులతో ఘన ఫలితాలు సాధించటం,

శత్రువు గురించి బయపడక ధైర్యం గా నిలవడం,

నిరాడంబరం గా జీవించడం ఉన్నత లక్ష్యాలకోసం తపించడం అల్లూరి సీతారామరాజు స్మృతి కి మనం ఇవ్వగలిగే నిజమైన నివాళి.

అ దిశ గా మన వ్యక్తిత్వ ప్రయాణమే ఆయన స్మృతి కి సమర్పించే నిజమైన అంజలి. వారే అల్లూరి కి వారసులు.

మీలోనే వున్న అల్లూరి ని తెలుసుకోండి, కలుసుకోండి, అనుసరించండి.
దేశ ప్రజలు మీ త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.

జోహార్ అల్లూరి సీతారామరాజు
జయహో అల్లూరి సీతారామరాజు
వందేమాతరం
జై హింద్

సుబ్బరాజు చింతలపాటి

Related posts