స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం “పుష్ప”. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మొదటిసారిగా జత కట్టబోతోంది. జగపతి బాబు, బాబీ సింహా తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా… ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీలో బన్నీ చిత్తూరు జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్‌లో భాగంగా బన్నీ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా లోకేషన్స్‌లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా అడవులు అందాల్ని చూడటానికి ఆయన వచ్చారు. శనివారం నేరడిగొండ మండలం కుంటాల, మావల మండలం హరిత వనాన్ని ఆయన సందర్శించారు. ఇక ఆదివారం మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతానికి వెళుతుండగా జైనథ్ మండలం మాండగడ టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై బన్నీ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఆయన వాహనంపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు. అల్లు అర్జున్‌తో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీలు పడ్డారు. బన్నీతో పాటు కుటుంబ సభ్యులు, ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. అల్లు అర్జున్ టీమ్‌తో అటవీ శాఖ అధికారులు కూడా ఉన్నారు.
previous post
next post