ఏపీలో ఇంకా అసంతృప్తులతో ఆయా పార్టీలకు తిప్పలు తప్పడంలేదు. తాజాగా, ఆళ్లగడ్డ ప్రాంతంలో పేరున్న నేతగా టీడీపీలో చేరిన మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి, ఆ పార్టీకి షాకిస్తూ, వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికారు. నంద్యాలకు ఉప ఎన్నికలు జరిగిన వేళ, టీడీపీలో చేరిన గంగుల, ఇప్పటి వరకూ అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఆళ్లగడ్డలో వైసీపీ అభ్యర్థి గంగుల బిజేంద్రారెడ్డి (నాని)కి మద్దతిస్తున్నట్టు ప్రతాప్ రెడ్డి కుటుంబం స్పష్టం చేసింది. బిజేంద్రను గెలిపించేందుకు కృషి చేయాలంటూ, తన కుటుంబీకులకు సలహాలు, సూచనలను ఆయన ఇచ్చారు. గంగుల ఫ్యామిలీ ఏకం కావడంతో టీడీపీకి, ముఖ్యంగా ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలో ఉన్న భూమా అఖిలప్రియకు షాక్ తగిలినట్లయింది.
ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు తనను సాయం అడిగారని, అందువల్లే నంద్యాల ఉప ఎన్నికల వేళ టీడీపీ అభ్యర్థి విజయం కోసం పని చేశానని చెప్పారు. ఆ సమయంలో ‘నంద్యాల పార్లమెంట్ కు మీరే సరైన అభ్యర్థి’ అని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు కనీసం తనను సంప్రదించకుండానే ఎంపీ అభ్యర్థిని ఖరారు చేశారని ఆరోపించారు. ప్రజాబలాన్ని పక్కనబెట్టి, ధనబలం ఉన్నవారిని ఎంపిక చేశారని అన్నారు. బిజేంద్రను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.